CJI Ramana: యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడిని ఆదేశించగలమా?

యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలమా? ఈ విషయంలో కోర్టు ఏం చేయగలుగుతుంది? అంటూ సీనియర్ న్యాయవాది ఏఎం దార్ ని ప్రశ్నించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.

  • Written By:
  • Updated On - March 4, 2022 / 11:07 AM IST

యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలమా? ఈ విషయంలో కోర్టు ఏం చేయగలుగుతుంది? అంటూ సీనియర్ న్యాయవాది ఏఎం దార్ ని ప్రశ్నించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది. అది.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు సంబంధించింది. దానిపై విచారణ సందర్భంగా ఈ ప్రశ్న వచ్చింది.

ఉక్రెయిన్ చిక్కుకున్న భారతీయుల రక్షణకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక వీడియోను జస్టిస్ ఎన్వీ రమణ చూశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని అందులో ప్రశ్నించారు. అయినా యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలనా? అంటూ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల గురించి తాము కూడా ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించారు.

రొమేనియా దగ్గరలో ఉక్రెయిన్ బోర్డర్ లో మన విద్యార్థులు చిక్కుకున్నారు. వారికి సాయం చేయడానికి కృషి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం.. అటార్నీ జనరల్ కు సూచించింది. చాలామంది విద్యార్థులు సరిహద్దుల్లో చిక్కుకున్నారని అందులో చాలామంది విద్యార్థినులు ఉన్నారని.. వారిలో 30 మంది గత ఆరు రోజులుగా ఆహారం, మంచినీరు లేకుండా సరిహద్దుల వద్దే ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్ తరుపు న్యాయవాది దార్.

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం ఆగలేదు. నానాటికీ రష్యా దాడుల తీవ్రతను పెంచుతూనే ఉంది. తొలిదఫా చర్చలు విఫలమయ్యాక దాడుల సంఖ్యను ఇంకా పెంచింది. ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు.. మన విద్యార్థులు క్షేమంగా బోర్డర్ దాటడానికి సహాయం చేస్తామని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారు. అందుకే వీలైనంత తొందరగా అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను దేశానికి తిరిగి తీసుకురావడానికి కేంద్రం కృషి చేస్తోంది.