Liquor Policy of Delhi : ఢిల్లీ లిక్కర్ పాలసీ వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెలుగులోకి రావడం ఈ వ్యవహారానికి మరింత ఊతమిచ్చింది. లిక్కర్ పాలసీలో అవకతవకల కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది. రాజ్యంగబద్ధ సంస్థ కాగ్..ఢిల్లీ మద్యం పాలసీలోని లోపాల్ని ఎత్తిచూపిందని, దీని కారణంగా ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని స్పష్టంగా వివరించింది.
కాగ్ నివేదిక ప్రకారం, మద్యం విధానానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే సమయంలో మంత్రివర్గం, లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోకపోవడం, నిపుణుల కమిటీ సూచనలను పట్టించుకోకపోవడం, లైసెన్సుల జారీ, రూల్స్ ఉల్లంఘనలు జరిగినట్లు వెల్లడైంది. నివేదికలో బిడ్డింగ్ ప్రక్రియ గురించి కూడా వివరాలిచ్చింది. బిడ్డింగ్ చేసిన కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి పరిశీలనలు లేకుండా, నష్టాల్లో ఉన్న సంస్థలకు కూడా లైసెన్సులు పునరుద్ధరించారని పేర్కొంది.
కాగా, ఈ లిక్కర్ పాలసీ కేసులో డిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక, ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల సమయానికి లిక్కర్ పాలసీకి సంబంధించి కాగ్ నివేదిక వెలువడడం ప్రముఖ చర్చా అంశంగా మారింది.
ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబరులో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీ ప్రకంపనలు సృష్టించింది. ఇందులో అవినీతి జరిగిందంటూ సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టడం… ఆప్ ప్రభుత్వ పెద్దలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా జైలుకు వెళ్లడం తెలిసిందే.