Site icon HashtagU Telugu

మ‌హిళ‌ల వివాహ వ‌య‌సు పెంపు..కేంద్ర కేబినెట్‌ ఆమోదం

దేశంలో మ‌హిళ‌ల వివాహ వ‌య‌సును పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్ర‌స్తుతం మ‌హిళ‌ల వివాహ వ‌య‌సు 18 ఏళ్లుగా ఉంది.అయితే తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఈ వ‌య‌సు 21కి పెరిగింది. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మహిళల వివాహ వయసును పెంచే విషయాన్ని సమీక్షిస్తున్నామని గత ఏడాది ప్రధాని మోదీ చెప్పిన ఏడాది తర్వాత కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం సందర్భంగా ఈ ప్ర‌తిపాద‌న గురించి మోదీ ప్రకటన చేశారు. కూతుళ్లు, సోదరీమణుల ఆరోగ్యం గురించి కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందని… పోషకాహార లోపం సమస్య నుంచి వీరిని కాపాడాలంటే వారికి సరైన వయసులోనే పెళ్లి చేయాల్సిన అవసరం ఉందని ఆ సందర్భంగా మోదీ చెప్పారు. ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయసు 18, పురుషుల కనీస వివాహ వయసు 21గా ఉంది. మహిళల కనీస వివాహ వయసును పెంచాలనే ప్రపోజల్ ను జయా జైట్లీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ కూడా సమర్థించింది. గత ఏడాది జూన్ లో ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ లో ప్రభుత్వ టాప్ ఎక్స్ పర్ట్ వీకే పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మహిళలు తొలిసారి గర్భం దాల్చే వయసు కనీసం 21 సంవత్సరాలుగా ఉండాలని టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది.

పెళ్లిళ్లు ఆలస్యంగా జరగడం వల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య అంశాలతో పాటు కుటుంబం, సమాజం, పిల్లలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెపుతున్నారు. ప్రపోజల్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో… దీనికి సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఉభయసభలు ఈ బిల్లులను ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి సంతకం చేస్తే ఇది చట్టరూపం దాలుస్తుంది. ఆ తర్వాత 21 సంవత్సరాల కంటే తక్కువ వయసులో మహిళలకు పెళ్లి చేస్తే చట్టరీత్యా శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది.