CAA In 7 Days : ‘‘దేశవ్యాప్తంగా వారం రోజుల్లోగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమల్లోకి వస్తుంది’’ అంటూ కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అయోధ్యలో రామమందిరం ప్రారంభమైంది. రాబోయే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమల్లోకి వస్తుంది. ఇది నా హామీ’’ అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో సీఏఏ అమలు చేస్తామని వెల్లడించారు. సీఏఏను భూమి మీద ఏ శక్తి అడ్డుకోలేదని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఈసందర్భంగా శంతను ఠాకూర్ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ పరగణాస్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి సైతం..
లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే సీఏఏ నిబంధలను నోటిఫై చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఇటీవల వెల్లడించారు. ”త్వరలోనే సీఏఏ నిబంధనలను జారీ చేయనున్నాం. ఒకసారి నిబంధనలను జారీ అయినట్లయితే చట్టం వెంటనే అమల్లోకి వస్తుంది. అర్హత కలిగిన వారికి పౌరసత్వం మంజూరు చేస్తాం” అని ఆయన తెలిపారు. ఏప్రిల్-మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను నోటిఫై చేస్తారా అని అడిగినప్పుడు.. దానికంటే చాలా ముుందుగానే ఉంటుందని ఆ అధికారి సమాధానమిచ్చారు. నిబంధనలు సిద్ధమయ్యాయని, ఆన్‌లైన్ పోర్టల్ కూడా రెడీగా ఉందని, మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని చెప్పారు. ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా ఇండియాలోకి ఎప్పుడు అడుగుపెట్టారో దరఖాస్తుదారులు డిక్లేర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అప్లికెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.
సీఏఏ వివరాలు ఇవీ..
- 2019 డిసెంబరు 11న పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) పార్లమెంటు ఆమోదించింది.
- ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2014 డిసెంబరులోగా భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తుంది.
- భారతీయ చట్టం ప్రకారం పౌరసత్వానికి మతాన్ని ఒక ప్రమాణంగా ఉపయోగించడం ఇదే తొలిసారి.
- అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పించడంపై ఎటువంటి నిబంధనలు పొందుపర్చలేదు. దీంతో ఈ చట్టం పలు విమర్శలకు దారి తీసింది.
- సీఏఏకు వ్యతిరేకంగా 2019 సంవత్సరంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా నిరసనలు వెల్లువెత్తాయి.
- 2020 నుంచి కేంద్ర హోం శాఖ సీఏఏ(CAA In 7 Days) అమలుకు నిబంధనలను రూపొందిస్తోంది.
- గత రెండేళ్లలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి 9 రాష్ట్రాలకు చెందిన 30 మందికిపైగా జిల్లా మేజిస్ట్రేట్లు, హోం సెక్రటరీలకు కేంద్రం అధికారాలు ఇచ్చింది.