UP Elections 2022 : యూపీలో బెంగాల్ ఈక్వేష‌న్

ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చే లీడ‌ర్లను తీసుకుని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ త‌ప్పు చేస్తున్నాడ‌ని ప‌శ్చిమ బెంగాల్ ఫ‌లితాల ఆధారంగా బోధ‌ప‌డుతోంది. అధికారంలో ఉన్న పార్టీ లీడ‌ర్ల మీద స‌హ‌జంగా వ్య‌తిరేక‌త ఉంటుంది.

  • Written By:
  • Updated On - January 12, 2022 / 04:19 PM IST

ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చే లీడ‌ర్లను తీసుకుని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ త‌ప్పు చేస్తున్నాడ‌ని ప‌శ్చిమ బెంగాల్ ఫ‌లితాల ఆధారంగా బోధ‌ప‌డుతోంది. అధికారంలో ఉన్న పార్టీ లీడ‌ర్ల మీద స‌హ‌జంగా వ్య‌తిరేక‌త ఉంటుంది. పైగా ఎమ్మెల్యేల‌పై స్థానిక ప్ర‌జ‌ల‌కు మ‌రింత వ్య‌తిరేక‌త ఉండ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఎన్నిక‌ల సంద‌ర్భంగా బెంగాల్ కేంద్రంగా టీఎంసీ నుంచి వ‌చ్చిన లీడ‌ర్ల‌ను బీజేపీ పెద్ద సంఖ్య‌లో తీసుకుంది. వాళ్ల‌ను ఎన్నిక‌ల బ‌రిలోకి చాలా వ‌ర‌కు దింపింది. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో వాళ్లు ఓడిపోయారు. ఇప్పుడు యూపీలో కూడా అలాంటి పరిణామం చోటుచేసుకుంటోంది. అధికార బీజేపీ నుంచి పెద్ద సంఖ్య‌లో ఎస్పీ వైపు క్యూ క‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టికే బీజేపీ మంత్రి స్వామి ప్ర‌సాద్ మౌర్య ఎస్పీకి ద‌గ్గ‌ర‌య్యాడు. ఆయ‌న‌తో పాటు మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడి ఎస్పీలో చేర‌డానికి సిద్ధం అవుతున్నార‌ని టాక్‌. అంతేకాదు, మ‌రో 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలోకి రాబోతున్నార‌ని ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ అంటున్నారు.

స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు బీజేపీకి చెందిన మరో నలుగురు రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్ మరియు వినయ్ షాక్యా సమాజ్ వాదీ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యార‌ని టాక్‌. అధికారికంగా ఇంకా చేర‌క‌పోయిన‌ప్ప‌టికీ వాళ్లు కూడా ఎస్పీకి మ‌ద్ధ‌తుదారుల‌ను అఖిలేష్ ప్ర‌క‌టించాడు. కానీ, స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య మాత్రం అంతా ఫేక్ అంటూ కొట్టిపారేస్తోంది. ఒక వేళ శ‌ర‌ద్ ప‌వార్ చెప్పిన‌ట్టు జ‌రిగితే..14 మంది ఎమ్మెల్యేలు ప్ల‌స్ మౌర్య అండ్ బ్యాచ్ మొత్తంగా 19 మంది బీజేపీ వీడే అవ‌కాశం ఉంది. అంటే, ఆ 19 మంది ఎస్పీ నుంచి పోటీ చేయ‌డానికి సిద్ధం అవుతారు. ఫ‌లితంగా ఎస్పీలోని లీడ‌ర్లు అసంతృప్తి చెందుతారు. స‌రిగ్గా ఇలాంటి ప‌రిణామం బెంగాల్ లోనూ జ‌రిగింది.ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా సుమారు 140 మందికి పైగా టీఎంసీ నేతలు బీజేపీలో చేరారు. వాళ్ల‌లో 35 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా-మార్క్సిస్టుల నుంచి కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 19 మంది ఎమ్మెల్యేలను ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన వాళ్ల‌ను బరిలోకి దింపింది. కేవలం ఆరుగురు మాత్రమే బీజేపీ గెలిపించుకోగ‌లిగింది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి ఎన్నికల్లో బీజేపీ త‌ర‌పున పోటీ చేసిన పలువురు రాజకీయ నాయకులు ఓడిపోయారు. ఈ ప‌రిణామం దీదీకి క‌లిసొచ్చింది.

యూపీలో ప్ర‌స్తుతం బీజేపీ నాయకులను చేర్చుకోవాలనే ఆసక్తితో అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. అసంతృప్తి ఎమ్మెల్యేల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. బెంగాల్‌లో బీజేపీ చేసిన తప్పునే ఉత్తరప్రదేశ్‌లోనూ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బెంగాల్ కంటే 109 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సారూప్యత ఏమిటంటే రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష శిబిరానికి ఒకే బలం ఉండ‌డం.
బెంగాల్‌లో కాంగ్రెస్‌, సీపీఎంలకు గ్రౌండ్‌ సపోర్ట్‌ లేకపోవడంతో బీజేపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా బీఎస్పీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంది. కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ఫ‌లితంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పోరు కనిపిస్తోంది. సో..ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు ఎస్పీ టిక్కెట్ల‌ను ఇస్తే..బీజేపీకి క‌లిసొచ్చే అవ‌కాశాలున్నాయ‌ని బెంగాల్ ఫ‌లితాలు చెబుతున్నాయ‌న్న‌మాట‌.