Lucknow : ల‌క్నోలో కూలిన భ‌వ‌నం.. 12 మందిని ర‌క్షించిన రెస్య్కూ టీమ్‌

ల‌క్నోలో భ‌వ‌నం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 12 మంది నివాసితులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. SDRF, NDRF, ఆర్మీ

  • Written By:
  • Publish Date - January 25, 2023 / 09:20 AM IST

ల‌క్నోలో భ‌వ‌నం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 12 మంది నివాసితులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. SDRF, NDRF, ఆర్మీ బృందాలు బుధవారం తెల్లవారుజాము వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. శిధిలాలను జాగ్రత్తగా తొలగించి, చిక్కుకున్న నివాసితులను బయటకు తీసుకువచ్చారు. ఈ భ‌వ‌నం కూలిపోవడంతో సమీపంలోని భవనాలు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. క్షతగాత్రులను లక్నోలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఇంకా నలుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ తెలిపారు. ప్రజలను సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రెస్క్యూ చేసిన వారికి సకాలంలో వైద్య సహాయం అందిస్తున్నామ‌ని తెలిపారు.శిధిలాల కింద చిక్కుకున్న వారికి ఆక్సిజ‌న్ అందిస్తున్నామ‌ని తెలిపారు. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్‌లను స్వయంగా పర్యవేక్షించిన హోంశాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ  సంజయ్ ప్రసాద్.. శిథిలాల కింద‌ చిక్కుకున్న వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పరిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. ఈ సంఘటన మంగ‌ళ‌వారం సాయంత్రం 7 గంటలకు జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని హోంశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సంజ‌య్ ప్ర‌సాద్ తెలిపారు. హజ్రత్‌గంజ్ ప్రాంతంలో నివాస భవనం – అలియా అపార్ట్‌మెంట్ – కూలిపోవడానికి గల కారణాన్ని వెంటనే నిర్ధారించలేనప్పటికీ, భవనం యొక్క పార్కింగ్ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భవనం పై అంతస్తులో 12 ఫ్లాట్లు, రెండు పెంట్‌హౌస్‌లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. కూలిపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విచారణ నిర్వహిస్తామని సంజ‌య్ ప్రసాద్ తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.