Union Budget 2026-27 : కేంద్ర బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి మిశ్రమ ఫలితాలను అందించింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల (Infrastructure) కల్పనకు పెద్దపీట వేస్తూ మెట్రో రైలు విస్తరణ, కొత్త హైవేల నిర్మాణం మరియు రైల్వే కనెక్టివిటీ పెంపుదల వంటి నిర్ణయాలు తీసుకోవడం సానుకూలాంశం. దీనివల్ల ముఖ్యంగా టైర్-2 నగరాల్లో భూముల విలువ పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వల్ల కొత్త ఏరియాలు అభివృద్ధి చెంది, ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే, నిర్మాణ రంగంలో కీలకమైన అఫర్డబుల్ హౌసింగ్ (తక్కువ ధర ఇళ్లు) కు సంబంధించి ఎటువంటి ప్రోత్సాహకాలు (Incentives) ప్రకటించకపోవడంపై ‘క్రెడాయ్’ (CREDAI) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్యుడు తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కొనుగోలు చేసేందుకు అవసరమైన పన్ను మినహాయింపులు లేదా వడ్డీ సబ్సిడీల ఊసే ఈ బడ్జెట్‌లో లేకపోవడం నిరాశ పరిచింది. దీనివల్ల కొత్త ఇళ్ల నిర్మాణాలు తగ్గే ప్రమాదం ఉందని, నిర్మాణ వ్యయం భారీగా పెరగడం వల్ల బిల్డర్లు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వెనకడుగు వేస్తారని క్రెడాయ్ హెచ్చరించింది.
Real Estate
మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల నగరం వెలుపల కొత్త ప్రాంతాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ధరల పెరుగుదల కారణంగా సామాన్యుడికి సొంతింటి కల మరింత దూరమయ్యేలా కనిపిస్తోంది. ఒకవైపు ముడిసరుకుల ధరలు, మరోవైపు ప్రోత్సాహకాల లేమి కలిసి మధ్యతరగతి ప్రజలపై భారాన్ని పెంచనున్నాయి. ఇల్లు కట్టుకోవాలనుకునే సామాన్యులకు బడ్జెట్ నేరుగా ప్రయోజనం చేకూర్చలేకపోయిందని, ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని రియల్ ఎస్టేట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
