Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026-27కి సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో ప్రజలు రాబోయే సాధారణ బడ్జెట్ పై తమ అంచనాలను అప్పుడే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 1, 2026న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో పాటు అదే రోజు రవిదాస్ జయంతి కూడా ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మారుతుందేమోనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జనవరి 28, 2026న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఈరోజు బుధవారం (జనవరి 7, 2026) పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఇందులో బడ్జెట్ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: హై హీల్స్ వేసుకున్నప్పుడు పాదాల నొప్పిని తగ్గించే అద్భుతమైన చిట్కా ఇదే!
నేటి సమావేశంలో ఏం జరగనుంది?
బడ్జెట్ సమావేశాల తేదీలు, బడ్జెట్ సమర్పణ రోజుపై తుది నిర్ణయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) తీసుకోనుంది. బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుండి ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ఆర్థిక సర్వే జనవరి 29న సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వం సెలవు రోజైన ఆదివారం నాడే పార్లమెంటును నడుపుతుందా లేదా బడ్జెట్‌ను ఫిబ్రవరి 2 (సోమవారం)కి వాయిదా వేస్తుందా అనే అంశంపై ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.
ఈసారి రికార్డు సృష్టించబోతున్నారా?
2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం. ప్రభుత్వ వర్గాలు, తాజా మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడానికే మొగ్గు చూపుతోంది. ఇదే గనుక జరిగితే ఇటీవలి కాలంలో ఆదివారం నాడు బడ్జెట్ కోసం పార్లమెంటు సమావేశం కావడం ఇదే మొదటిసారి అవుతుంది.
గతంలో ఎప్పుడైనా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారా?
అవును భారత పార్లమెంటరీ చరిత్రలో ఇలా గతంలోనూ జరిగింది. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆదివారం. అలాగే శనివారాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020, 2025 సంవత్సరాల్లో శనివారం నాడే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
