Buddhadeb Bhattacharjee : బెంగాల్ మాజీ సీఎం బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు

Published By: HashtagU Telugu Desk
Buddhadeb Bhattacharjee

Buddhadeb Bhattacharjee

ప్రముఖ లెఫ్ట్‌నెంట్ నేత, సీపీఎం సీనియర్ నేత, పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) (80) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. చూపు మందగించడం, ఊపిరితిత్తుల వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నాడు. దీంతో కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఆరోగ్యం విషమించడం తో కన్నుమూశారు. ఈయన మరణ వార్తను కుమారుడు సుచేత‌న్ భ‌ట్టాచార్య అధికారికంగా ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

మార్చి 1, 1944లో జన్మించిన బుద్ధదేవ్ భట్టాచార్య.. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. కొద్ది రోజుల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనంతరం 1966 కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బెంగాల్‌లో జరిగిన ఆహార ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1972లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 1982లో ఆ పార్టీ సెక్రెటరీగా నియమితులయ్యారు. మొదటిసారి 1977 ఎన్నికల్లో కాషీపూర్-బెల్గచియా స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పాలన ముగిసి కమ్యూనిస్ట్‌‌లు అధికారంలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి వరించింది.

జ్యోతిబసు వారసుడిగా బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని 2000లో చేపట్టిన భట్టాచార్య.. 2011 వరకూ కొనసాగారు. ఆ ఏడాది జరిగిన శాసససభ ఎన్నికల్లో బెంగాల్‌‌లో కమ్యూనిస్ట్ పార్టీ 34 ఏళ్ల సుదీర్ఘ పాలనకు మమతా బెనర్జీ ముగింపు పలికారు. తృణమూల్ కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో కమ్యూనిస్ట్‌ల శకం ముగిసింది. భట్టాచార్య నాయకత్వంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో పోటీచేసి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు. పార్టీ కోసం చాలా కీలకంగా పనిచేశారు. 1972 నుంచి రాజకీయాల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ బెంగాల్‌లో కమ్యూనిస్టుల మార్క్‌ను కొనసాగించారు. జ్యోతిబసు తర్వాత 11 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో అధికకాలం కొనసాగింది బుద్ధదేవ్‌ భట్టాచార్య మాత్రమే. అలాగే జ్యోతిబసు తర్వాత రెండవ, చివరి సీపీఎం ముఖ్యమంత్రి కూడా ఆయనే. బుద్ధదేవ్‌ భట్టాచార్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతూ వస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు.

Read Also : India Batters: వన్డేల్లో టీమిండియా చెత్త రికార్డు.. అది కూడా స్పిన్ బౌలింగ్‌లో..!

  Last Updated: 08 Aug 2024, 12:02 PM IST