Owaisi: గుజరాత్ పోల్స్ కు .. మజ్లిస్ రెడీ

ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దూకేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతోంది.

  • Written By:
  • Updated On - April 16, 2022 / 06:48 PM IST

ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దూకేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం యోచిస్తోంది. గత సంవత్సరం గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన మజ్లిస్ పార్టీ 25 సీట్లు గెలుచుకుంది. వీటిలో 7 సీట్లు ఒక్క అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే ఉన్నాయి. తాజాగా ఈనెల 11న మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అహ్మదాబాద్ కు వెళ్లారు. ఆ నగరంలో ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే జుహాపురా లోని ఒక మసీదు లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఈ పర్యటన సందర్భంగా ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ గుజరాత్ విభాగం ముఖ్య నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ కు మద్దతు పలికిన ” భారతీయ ట్రైబల్ పార్టీ” ..ఇకపై ఆమె ఆద్మీ పార్టీ తో కలిసి పని చేస్తామని ప్రకటించింది. ఈనేపథ్యంలో భావ సారూప్యత కలిగిన కొత్త భాగస్వామ్య పక్షాలను వెతుకులాడే పనిని ఇప్పటి నుంచే అసదుద్దీన్ ప్రారంభించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం.. మజ్లిస్ ను బీజేపీ కి “బీ” టీమ్ గా విమర్శిస్తోంది. ” 2014, 2019 గుజరాత్ అసెంబ్లీ పోల్స్ లో మేము పోటీ చేయకున్నా.. కాంగ్రెస్ కు గుండు సున్నాయే వచ్చింది. కాంగ్రెస్ వాళ్లు చేస్తున్న విమర్శలు చాలా పాతబడ్డాయి” అని ఒవైసీ వ్యాఖ్యానించారు.