Site icon HashtagU Telugu

BRS : రేపే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ భవనం విశేషాలు ఏంటో తెలుసా??

BRS Delhi Office opening on Thursday afternoon by KCR

BRS Delhi Office opening on Thursday afternoon by KCR

ఎట్టకేలకు ఢిల్లీలో(Delhi) బీఆర్ఎస్(BRS) జాతీయ కార్యాలయం ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం ఢిల్లీకి సీఎం కేసీఆర్(CM KCR) పయనం కానున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు మద్యాహ్నం ఢిల్లీ వసంత్ విహార్ లోని బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు శృంగేరి పీఠం ఆధ్వర్యంలో వేద పండితులచే వాస్తుపూజతో పాటు సుదర్శన హోమం జరిపిస్తారు. మధ్యాహ్నం 1:05 గంటలకు కేసీఆర్ బీఆర్ఎస్ భవనాన్ని ప్రారంభిస్తారు. పూర్తిస్థాయిలో పనులు పూర్తి కావడానికి మరో 10 రోజుల సమయం పడుతుంది. అయితే రేపు మంచి రోజు కావడంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ ను ప్రారంభిస్తున్నారు. మద్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారభోత్సవానికి పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, పలువురు కార్యకర్తలు హాజరుకానున్నారు.

బీఆర్ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయం 20 నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసుకుంది. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినా ఢిల్లీలో కాలుష్యం కారణంగా నిర్మాణ పనులపై ప్రభుత్వం ఆంక్షలతో ఆలస్యమైంది. దక్షిణాది నుంచి ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్న రెండో పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు పొందింది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంది.

2021 సెప్టెంబర్ 2వ తేదీన బీఆర్ఎస్ భవన్ కు భూమి పూజ చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంను ఎండిపి ఇన్ఫ్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో ఈ భవన నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణ పనుల్లో ఢిల్లీ, యూపీ, హర్యానా భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఎడమ వైపు వైపు సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం, కుడి వైపు జేడీయూ పార్టీ కార్యాలయం ఉంది.

2024 సార్వత్రిక ఎన్నికలకు జాతీయ స్థాయిలో ఢిల్లీ నుంచి పార్టీ కార్యకలాపాలు బీఆర్ఎస్ నడపనుంది. మూడు అంతస్థుల్లో ఈ భవనం ఉంది. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులు ఉన్నాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా హాల్ తో పాటు రెండు గదులు, లోయర్ గ్రౌండ్లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్, గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్తలు, నాయకుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్, 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 20 గదులు, రెండు ప్రత్యేక సూట్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

 

Also Read : Operation NTR Statue : BRS కు జూనియ‌ర్ క్రేజ్! రేవంత్, T-TDPకి బ్రేక్!