British PM: బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని!

బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ శుక్రవారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ను సంద‌ర్శించారు.

  • Written By:
  • Updated On - April 22, 2022 / 01:13 PM IST

బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ శుక్రవారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ను సంద‌ర్శించారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సంప్ర‌దాయ సైనిక బ్యాండ్ తో బ్రిట‌న్ ప్ర‌ధానిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లోకి ప్ర‌ధాని తోడ్కొని వెళ్లారు. ఈ సంద‌ర్భంగా బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ మాట్లాడుతూ.. భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు రావ‌డం త‌న‌కు ఎంతో సంతోషాన్నిచ్చింద‌ని తెలిపారు. త‌న‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆత్మీయంగా స్వాగ‌తించార‌ని కొనియాడారు. ప్ర‌ధాని మోదీతో చ‌ర్చించే అవ‌కాశం రావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. బోరిస్ జాన్స‌న్ తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ద్వైపాక్షిక చ‌ర్చ లు జ‌రుపుతున్నారు.

ఢిల్లీలోని హైద‌రాబాద్ హౌస్‌కు చేరుకున్న ఇరు దేశాల ప్ర‌ధానులు భార‌త్‌, బ్రిట‌న్ దేశాల ద్వైపాక్షిక అంశాల‌తోపాటు బ్రిట‌న్‌లో ఖలిస్థాన్ మద్దతుదారుల వ్యవహారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపైనా చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు సహా భారత్‌లో పెట్టుబడులు, బ్రిటన్‌లోని భారతీయులకు వీసాల సడలింపు వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఈ చర్చల్లో భారత్ – బ్రిటన్ దేశాల విదేశాంగ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారులు, దౌత్య అధికారులు పాల్గొన్నారు.

కాగా ఆయన నిన్నటి పర్యటనలో బుల్డోజర్ ఎక్కడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో చట్టవిరుద్ధ ఆక్రమణలను బుల్డోజర్లతో తొలగిస్తున్న నేపధ్యంలో అధికార విపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. ఇదే సమయంలో బోరిస్ జాన్సన్ ఇలా బుల్డోజర్ ఎక్కి కనిపించడం ఆసక్తికరం. భారత పర్యటనలో భాగంగా ప్రస్తుతం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఉన్న ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి పంచమహాల్లోని జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు. ఆ సమయంలోనే ఆయన ఆసక్తిగా ఒక బుల్డోజర్ పైకి ఎక్కి ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు.