BBC – Ram Mandir : జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నవ్య భవ్య రామమందిర ప్రతిష్ఠాపన వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) కవరేజీ ఇచ్చిన తీరుపై భారత్‌తో పాటు బ్రిటన్‌లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత పక్షపాత వైఖరితో రామమందిర కార్యక్రమం వార్తను బీబీసీ రాసిందని బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మన్ పార్లమెంటు వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. UK పార్లమెంట్‌లో బాబ్ బ్లాక్‌మన్ మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలోని అదే ప్రదేశంలో మసీదు కంటే ముందు.. 2వేల ఏళ్లపాటు రామమందిరం ఉండేదన్న చారిత్రక విషయాన్ని మర్చిపోయి బీబీసీ జనవరి 22న ఆ వార్తను ప్రచురించింది. ‘మసీదును ధ్వంసం చేసిన ప్రదేశంలో హిందూ ఆలయానికి ప్రతిష్ఠాపన’ అనే పదజాలాన్ని బీబీసీ వార్తలో వాడటం చాలా అభ్యంతరకరం’’ అని తెలిపారు.‘‘ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ప్రదేశం..శ్రీరాముడి జన్మభూమి. అందుకే ఆ కార్యక్రమం నిర్వహణపై యావత్ హిందూలోకం సంతోషించింది’’ అని బాబ్ బ్లాక్‌మన్(BBC – Ram Mandir) చెప్పుకొచ్చారు. ‘‘భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం మసీదు నిర్మాణానికి అయోధ్య సమీపంలోనే ఐదెకరాల స్థలాన్ని కూడా కేటాయించిన విషయాన్ని బీబీసీ మర్చిపోయింది’’ అని ఆయన పార్లమెంటుకు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో BBC తప్పనిసరిగా వార్తల రూపంలో అందించాలి. అయితే ఆయా వార్తల సమాచారం తప్పుల తడకగా.. పక్షపాత వైఖరితో ఉండకూడదు’’ అని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join
అయోధ్య రామమందిరం కంటే ఐదు రెట్లు పెద్ద ఆలయం
- జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అయితే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కంబోడియాలోనో లేక అమెరికాలోనో కాదు, భారత్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసుకుందాం.
- బీహార్, తూర్పు చంపారన్‌లోని కైత్వాలియా (కొంతమంది కథ్వాలియా అంటారు)లో ప్రపంచంలోనే అతి పెద్ద రామాలయాన్ని నిర్మిస్తున్నారు.
- ఈ ఆలయం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది.
- నవంబర్ 13, 2013న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఆలయ భవిష్యత్తు నమూనాను ఆవిష్కరించారు. దీని పేరు విరాట్ రామాయణ దేవాలయం.
- మే 2023లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
- ఆలయం పూర్తిగా నిర్మించిన తర్వాత అయోధ్య నుంచి జనక్‌పూర్ వైపు వెళ్లేటప్పుడు ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం దీని నిర్మాణం వేగంగా జరుగుతోంది.
- 2025 చివరి నెల నాటికి ఆలయం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కొత్త దేవాలయం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం కాబోతోంది.
- ఈ ఆలయం 125 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది. దీన్ని 200 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
- ఆలయ వైశాల్యం 3.67 లక్షల చదరపు అడుగులు. ఈ భారీ రామాయణ దేవాలయం పొడవు 1080 అడుగులు, వెడల్పు 540 అడుగులు. ఈ ఆలయాన్ని మొత్తం 3,102 స్తంభాలతో నిర్మిస్తున్నారు.