R*pe Threaten : బ్రిటన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త చేసిన ఘోర ప్రవర్తన, దాని తర్వాత వెలుగులోకి వచ్చిన కోర్టు తీర్పు, భార్య చేసిన ‘మానసిక ఆరోగ్యం’ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. విమాన సిబ్బందిని అత్యంత దారుణంగా అవమానించి, ప్రాణహాని, అత్యాచారం వంటి హేయమైన బెదిరింపులు చేసిన ఈ వ్యక్తికి జైలు శిక్ష పడింది. అయితే, అతని భార్య మాత్రం భర్తకు మానసిక ఆరోగ్య సమస్యలే కారణమని, సానుభూతితో చూడాలని పిలుపునిచ్చింది. ఈ వైఖరి విమర్శలతో పాటు చర్చలకు తావిస్తోంది.
స్టాఫింగ్ మ్యాచ్ అనే రిక్రూట్‌మెంట్ సంస్థ వ్యవస్థాపకుడు సల్మాన్ ఇఫ్తికార్ అనే ఈ వ్యాపారవేత్తకు బ్రిటన్‌లోని ఐల్‌వర్త్ క్రౌన్ కోర్టు ఆగస్టు 5న 15 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజులకే—ఆగస్టు 7న—సల్మాన్ భార్య, పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అబీర్ రిజ్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సానుభూతి రీతిలో పోస్ట్ చేశారు. ఆమె, “మానసిక ఆరోగ్యం అనేది హాస్యాస్పద విషయం కాదు. ప్రతి కథ వెనుక మీరు చూడని బాధ దాగి ఉంటుంది. ఇతరులను తప్పుబట్టే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దయ, మానవత్వంతో ఉండండి” అని పేర్కొన్నారు. అయితే మీడియా కథనాల ప్రకారం, సల్మాన్‌కు యూకేలో మరో భార్య కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన 2023 ఫిబ్రవరి 7న చోటుచేసుకుంది. లండన్ నుంచి లాహోర్ వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ విమానంలో ఫస్ట్ క్లాస్‌లో తన ముగ్గురు పిల్లలతో ప్రయాణిస్తున్న సల్మాన్, ప్రయాణం మధ్యలో అధికంగా మద్యం సేవించాడు. ఆ తర్వాత రెచ్చిపోయి సిబ్బందితో వాగ్వాదం మొదలుపెట్టాడు. ఆంగీ వాల్ష్ అనే మహిళా సిబ్బందిపై జాత్యహంకారపు వ్యాఖ్యలు చేస్తూ, “నువ్వు నాకు ఏం చేయాలో చెప్పే హక్కు లేదు” అని అరవడం ప్రారంభించాడు.
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై దళాల దూకుడు… కిష్ట్వార్, కుల్గాంలో ఆపరేషన్లు
అక్కడితో ఆగకుండా మరింత హద్దు దాటాడు. ఆంగీ వాల్ష్‌ను ఉద్దేశించి, “నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఉండే హోటల్ పేలిపోతుంది. నీ జుట్టు పట్టుకుని గదిలోంచి బయటకు లాగి, సామూహిక అత్యాచారం చేసి, నిప్పంటిస్తారు” అంటూ ప్రాణహానికర, లైంగిక హింసకు సంబంధించిన తీవ్ర బెదిరింపులు చేశాడు. ఈ మాటలు విన్న ఇతర ప్రయాణికులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. విమానం లాహోర్‌లో ల్యాండ్ అయిన తర్వాత కూడా అతడిని అక్కడే అరెస్ట్ చేయలేదు. కానీ 2024 మార్చి 16న, ఇంగ్లండ్‌లోని అతని నివాసంలో బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతనిపై విమాన సిబ్బంది భద్రతకు ముప్పు కలిగించడం, జాత్యహంకారపు వ్యాఖ్యలు చేయడం, హింసాత్మక బెదిరింపులు చేయడం వంటి పలు కేసులు నమోదు చేశారు.
బాధితురాలు ఆంగీ వాల్ష్ కోర్టులో, ఈ ఘటన తనపై చూపిన ప్రభావం గురించి వివరించారు. “ఈ సంఘటన వల్ల నేను తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాను. దాదాపు 14 నెలల పాటు నేను నా ఉద్యోగానికి హాజరుకాలేకపోయాను. ప్రతిసారీ ఆ సంఘటన గుర్తొస్తే భయాందోళనకు లోనయ్యాను” అని ఆమె వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఘటనపై వర్జిన్ అట్లాంటిక్ సంస్థ కూడా కఠినంగా స్పందించింది. “మా సిబ్బంది భద్రతకు మేము ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. ఇలాంటి ప్రవర్తనను ఏ మాత్రం ఉపేక్షించం. బాధిత సిబ్బందికి మేము పూర్తిగా అండగా ఉంటాం” అని ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనలో కోర్టు సల్మాన్‌కి శిక్ష విధించగా, అతని భార్య ‘మానసిక ఆరోగ్యం’ కోణంలో సానుభూతి చూపాలని కోరడం సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన తెచ్చింది. కొంతమంది ఇది మానవతా కోణంలో సరైనదని చెప్పినా, మరికొందరు మాత్రం ఇలాంటి ఘోర ప్రవర్తనకు సానుభూతి చూపడం తప్పని విమర్శిస్తున్నారు.
AP Free Bus For Women : మహిళలకు బిగ్ షాక్.. ఆ బస్సుల్లో..ఆ రూట్లలో ఉచిత ప్రయాణం లేనట్లేనా..?