Bride: జీవితం అంటేనే రకరకాల ఆటుపోట్లు వస్తుంటాయి. అలాంటి వాటన్నింటిని తట్టుకొని నిలబడాలి అని అందరూ అంటూ ఉంటారు. కానీ నిజంగా సమస్య వచ్చినప్పుడు మాత్రం అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. ప్రముఖ ఐటీ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ లు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. దీంతో వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.
తాజాగా మైక్రోసాఫ్ట్ లో జరిగిన లేఆఫ్ లలో భాగంగా ఉద్యోగం కోల్పోయిన ఓ అబ్బాయికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అతడి జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి విషయంలో అతడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మైక్రోసాఫ్ట్ లో పని చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వీళ్ల పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి ముందే అతడి ఉద్యోగం లేఆఫ్ వల్ల ఊడింది.
దీంతో అతడితో పెళ్లి నిశ్చయం చేసుకున్న అమ్మాయి.. సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి విషయంలో ఉన్న ఇబ్బందిని నెటిజన్ల ముందు ఉంచి, పరిష్కారం చూపాలంది. ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉంటున్న వ్యక్తిని ఇంకా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని ఆ అమ్మాయి సోషల్ మీడియా వేదికగా తన సందేహాన్ని బయటపెట్టింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మనసుకు నచ్చినట్లు చేయమని కొందరు ఆమెకు సలహా ఇస్తే.. ఇదే మంచి అవకాశం పెళ్లికి నో చెప్పమని మరికొందరు సలహా ఇచ్చారు. ఓ నెటిజన్ మాత్రం మూడు ఆప్షన్లు సూచించాడు. అతడు చెప్పిన మూడు ఆప్షన్లు..1. అతనికి త్వరలో మంచి ఉద్యోగం వచ్చేంత వరకు వేచి ఉండటం 2. మైక్రోసాఫ్ట్ అతడిని అకస్మాత్తుగా ఉద్యోగం నుండి తొలగించినందుకు డబ్బు బాగానే ఇస్తుంది కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకోవడం 3. నువ్వు హిపోక్రైట్ అని పెళ్లి క్యాన్సిల్ చేసుకో అని సలహా ఇచ్చాడు. మరో నెటిజన్ మాత్రం పాపం.. ఇలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు అని కామెంట్ చేశారు.