Bride Dies: పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా బర్గారి గ్రామంలో జరిగిన ఓ దుర్ఘటన అందరినీ కలచివేసింది. వివాహానికి ఒక రోజు ముందు పెళ్లికూతురు గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆనందంగా ఉండాల్సిన పెళ్లింట్లో విషాదం నెలకొంది.
బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామం రౌకేకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇరువురు కుటుంబాల అంగీకారంతో అక్టోబర్ 24న పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు కొన్ని రోజుల కిందటే భారత్‌కు వచ్చి ఏర్పాట్లలో పాల్గొన్నాడు.
అక్టోబర్ 23న పూజ కుటుంబం పెళ్లికి ముందు జాగరణ్ వేడుకను నిర్వహించింది. ఆ వేడుకలో పూజ ఎంతో ఉత్సాహంగా భాంగ్రా నృత్యం చేసింది. అయితే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆమెకు ముక్కు నుంచి రక్తస్రావం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమె ఇప్పటికే గుండెపోటుతో మరణించిందని తెలిపారు. ఈ వార్తతో గ్రామం మొత్తంలో శోకసంద్రం నెలకొంది.
పూజ తండ్రి హర్జిందర్ సింగ్ మాట్లాడుతూ, “మా అమ్మాయి పెళ్లి కోసం ఎంతో సంతోషంగా సిద్ధమవుతోంది. కానీ ఒక్కసారిగా ఇలా జరిగిపోతుందని ఊహించలేదు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు” అని బాధ వ్యక్తం చేశారు.
వధూవరుల కుటుంబాలు పెళ్లి కోసం భారీ ఖర్చులు పెట్టినట్లు, అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ అనుకోని ఘటనతో రెండు కుటుంబాలు ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాయి.
వైద్య నిపుణుల ప్రకారం, వేడుకల సమయంలో అధిక శబ్దం చేసే డీజే సౌండ్ (90–120 డెసిబెల్స్ వరకు) గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. పోలీసులు రాత్రి 10 తర్వాత డీజే వినియోగాన్ని నిషేధించినప్పటికీ, ఇంకా చాలామంది అనుమతి లేకుండా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
