Site icon HashtagU Telugu

Saibaba : ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు

Sai Baba

Sai Baba

Saibaba : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబాకు ఎట్టకేలకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయనను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదు శిక్షను కూడా రద్దు చేసింది. ఈమేరకు న్యాయస్థానం మంగళవారం తీర్పును వెలువరించింది. మావోయిస్టులతో లింక్ కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. యాభై నాలుగేళ్ల సాయిబాబా వీల్‌చైర్‌కే పరిమితమైన దివ్యాంగుడు. ఆయన ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017లో గడ్చిరోలి  సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా(Saibaba), ఇతరులు చేసిన అప్పీల్‌పై బాంబే హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. నిందితులపై మోపిన కేసును కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన వినయ్ జోషి, వాల్మీకి ఎస్‌ఏ మెనెజెస్‌లతో కూడిన నాగపూర్‌ బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

We’re now on WhatsApp. Click to Join

  • మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలతో సాయిబాబాను 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
  • యూఏపీఏ చట్టం కింద సాయిబాబాపై అభియోగాలు మోపటంతో ఆయనకు గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు యావజ్జీవ ఖైదు శిక్షను విధించింది.
  •  ఈ శిక్షను బాంబే హైకోర్టులో సాయిబాబా సవాల్‌ చేయగా.. 2022 అక్టోబర్ 14వ తేదీన యావజ్జీవ ఖైదును రద్దు చేసింది. సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని అప్పట్లో బాంబే హైకోర్టు ఆదేశించింది.
  • అయితే ప్రొఫెసర్‌ సాయిబాబా రిలీజ్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో అప్పట్లో ఆయనకు ఊరట లభించలేదు.

ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?

  • ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు.
  • 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
  • ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న అండా సెల్‌లో నిర్బంధించారు.
  • వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు.
  • 2014 నుంచి ఇప్పటివరకు జైలులో ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.