Students Threat Emails : దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు ఈ ఏడాది చాలాసార్లు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఇంతకీ వాటిని ఎవరు పంపారు ? అది ఉగ్రవాదుల పనా ? ఖలిస్తానీ ఉగ్రవాదులు ఆ ఈమెయిల్స్ పంపారా ? అనే సందేహాలు రేకెత్తాయి. అయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read :National Mathematics Day : ‘గణిత దినోత్సవం’.. స్ఫూర్తిప్రదాత శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు
ఇటీవలే ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న రెండు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ను ఇంకెవరో కాదు.. ఆయా స్కూళ్ల విద్యార్థులే పంపారని పోలీసుల విచారణలో తేలింది. పరీక్షల తేదీలు సమీపిస్తుండటంతో.. వాటిని వాయిదా వేయించాలనే ఉద్దేశంతో బెదిరింపు ఈమెయిల్స్(Students Threat Emails) పంపారని వెల్లడైంది. ఆ రెండు స్కూళ్లకు వేర్వేరుగా బెదిరింపు ఈమెయిల్స్‌ను పంపిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. తాను పరీక్షలకు ఇంకా రెడీ కానందున.. వాటిని వాయిదా వేయించేందుకు ఈవిధంగా కుట్రపన్నామని ఓ విద్యార్థి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడట. స్కూలుకు వెళ్లడం ఇష్టంలేక.. పరీక్షలు రాయడం ఇష్టంలేక.. బెదిరింపు ఈమెయిల్‌ను తమ స్కూలుకు పంపానని మరో విద్యార్థి చెప్పాడట. ఆ ఇద్దరు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, స్కూలు నిర్వాహకుల సమక్షంగా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారని తెలిసింది. డిసెంబరు 9వ తేదీన ఢిల్లీలోని 40కిపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని బెదిరింపు ఈమెయిల్స్‌లో ప్రస్తావించారు. పేలుళ్లు జరగకుండా ఆపేందుకు తమకు రూ.25 లక్షలు పంపాలని వాటిలో పేర్కొన్నారు. అయితే ఆ ఈమెయిల్స్ ఫేక్ అని తేలింది.
Also Read :Ferry Capsize : పడవ బోల్తా.. 38 మంది మృతి.. 100 మందికిపైగా గల్లంతు
ఢిల్లీలోని సెక్టార్ 65 ఏరియాలో ఉన్న శ్రీరాం మిలీనియం స్కూలుకు కూడా ఇటీవలే ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దాన్ని 12 ఏళ్ల వయసున్న ఒక విద్యార్థి పంపాడని విచారణలో గుర్తించారు. అతడిని పోలీసులు విచారించగా.. స్కూలులో ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే తాను బెదిరింపు ఈమెయిల్‌ను పంపానని సదరు విద్యార్థి ప్రస్తావించాడు. వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (వీపీఎన్) ద్వారా తాను బెదిరింపు ఈమెయిల్ పంపానని.. దాన్ని పోలీసులు గుర్తిస్తారని అనుకోలేదని చెప్పాడు.