Bomb Scare: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం బాంబు ఉందంటూ అందిన బెదిరింపు (Bomb Scare)తో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే భద్రతా సంస్థలు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించగా, ఇది కేవలం నకిలీ బెదిరింపు అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టెర్మినల్ 3 వద్ద సమాచారం
ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద బాంబు ఉన్నట్లు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. దీనితో భద్రతా సిబ్బంది, బాంబు స్క్వాడ్‌లు వెంటనే రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి తనిఖీలు నిర్వహించిన అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇది నిరాధారమైన బెదిరింపు అని పోలీసులు నిర్ధారించారు.
Also Read: IPL 2026 Retention: ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్.. ఏ రోజు, ఎక్కడ లైవ్ చూడాలి?
ఈమెయిల్ ద్వారా బెదిరింపు
ఈ బాంబు బెదిరింపు సమాచారం ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫిర్యాదు పోర్టల్‌కు అందిన ఈమెయిల్ ద్వారా వచ్చిందని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఈ బెదిరింపు ఈమెయిల్‌లో ఢిల్లీ విమానాశ్రయంతో పాటు చెన్నై, గోవా, ముంబై సహా మొత్తం భారతదేశంలోని ఐదు విమానాశ్రయాలలో బాంబులు పెట్టినట్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భద్రతా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అన్ని విమానాశ్రయాలను హై అలర్ట్‌లో ఉంచి, తనిఖీలు చేపట్టారు.
వారణాసి విమానానికి ప్రత్యేక బెదిరింపు
ఈ ఉద్రిక్తతల మధ్యే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఒకదానికి ప్రత్యేకంగా బెదిరింపు అందింది. వారణాసికి వెళ్లాల్సిన తమ విమానానికి బాంబు ముప్పు ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ధృవీకరించారు. విమానయాన భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం.. ఈ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వం నియమించిన బాంబు ముప్పు అంచనా కమిటీకి అందించారు. తక్షణమే అన్ని భద్రతా చర్యలు చేపట్టారు. సదరు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అందులోని ప్రయాణీకులందరినీ కిందకు దించి, ప్రస్తుతం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు.
