Site icon HashtagU Telugu

Odisha : మహానది నదిలో బోల్తా పడిన పడవ .. ఏడుగురు మృతి

Boat Capsizes In Nigeria

Boat Capsizes In Nigeria

Boat Capsizes In Odisha : ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడలో శారద సమీపంలోని మహానదిలో శుక్రవారం ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 40 మంది ప్రయాణికులను రక్షించారు. అయితే ఈ ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. ఏడుగురు మృతిచెందడం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. దీంతోపాటు రక్షించిన వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, శుక్రవారం సాయంత్రం దాదాపు 50 మందికిపైగా ప్రయాణికులతో పథర్సేని కుడా నుంచి బర్గర్ జిల్లాలోని బంజిపాలి వెళ్తుండగా పడవ బోల్తా పడింది. వెంటనే గమనించిన స్థానిక మత్స్యకారులు నదిలోకి దూకి 35 మందిని కాపాడారు. తర్వాత పోలీసులు, సహాయక సిబ్బంది కొంతమందిని రక్షించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గల్లంతైన ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. అయితే ప్రయాణికులంతా ఛత్తీస్​గఢ్​కు చెందిన వారు. పడవ సామర్థ్యానికి కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులను కాపాడిన మత్స్యకారులు తెలిపారు.

Read Also: China : చైనా మునిగిపోతుంది.. సంచలన అధ్యయన నివేదిక

మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​ సాయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఝార్సుగూడ జిల్లా పరిపాలన యంత్రాంగంతో ఈ ప్రమాదం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఝార్సుగూడ జిల్లా కలెక్టర్ కార్తికేయ గోయల్ ఘటనాస్థలిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ‘ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వారిని రక్షించేందుకు భువనేశ్వర్ నుంచి స్కూబా డైవర్లు వస్తున్నారు. మరణించిన వారిలో 35 ఏళ్ల మహిళ ఉంది. గల్లంతైన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు’ కలెక్టర్ తెలిపారు.