Site icon HashtagU Telugu

Delhi Blast : ఢిల్లీలో అలజడి.. పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ పేలుడు

Delhi Blast Prashant Vihar Pvr Multiplex

Delhi Blast : దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉత్తర ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో ఉన్న ‘బన్సీవాలా’ స్వీట్ షాప్‌ వద్ద భారీ పేలుడు సంభవించింది. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు(Delhi Blast) పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మొత్తం ఏరియాను తమ అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇంకా ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇక ‘బన్సీవాలా’ స్వీట్ షాప్‌ వద్ద పేలుడు జరిగిన ప్రదేశంలో తెల్లటి పొడి దొరికిందని పోలీసులు వెల్లడించారు.

Also Read :December Horoscope : డిసెంబరులో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

ఈ పేలుడుకు ఏ పదార్థాన్ని వాడారు ? దాన్ని ఎలా అమర్చారు  ? ఎవరు అమర్చారు ? అనే వివరాలను తెలుసుకోవడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈక్రమంలో స్వీట్ షాపు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నారు. దాన్ని నిశితంగా పరిశీలిస్తే.. పేలుడు పదార్థాన్ని అమర్చిన వారిని గుర్తించే అవకాశం ఉంది. బన్సీవాలా స్వీట్ షాప్ వద్ద పేలుడు సంభవించిందని తమకు ఇవాళ ఉదయం 11.48 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. తాము వెంటనే అక్కడికి నాలుగు ఫైర్ ఇంజిన్లను పంపినట్లు చెప్పారు.  ఎవరు కాల్ చేశారు అనే సమాచారాన్ని గుర్తించే  పనిలో పోలీసులు ఉన్నారు.

Also Read :Rs 7300 Crore Fine : ఎనిమిది కార్ల కంపెనీలపై రూ.7,300 కోట్ల పెనాల్టీ.. ఎందుకు ?

అంతకుముందు అక్టోబరు 20న కూడా ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లోనే పేలుడు జరిగింది. ఈ ఏరియాలోని సీఆర్‌పీఎఫ్ స్కూలు కాంపౌండ్ గోడ వద్ద అమర్చిన బాంబు పేలింది. అదొక క్రూడ్ బాంబు అని పోలీసులు గుర్తించారు. దాన్ని రిమోట్ కంట్రోల్ సాయంతో అత్యంత సమీపం నుంచే పేల్చి ఉండొచ్చని దర్యాప్తులో తేలింది. ఈక్రమంలోనే అప్పట్లో స్కూలు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. పేలుడు జరగడానికి ముందురోజు రాత్రి.. ఒక అనుమానిత వ్యక్తి   స్కూలు సమీపంలోకి వచ్చి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. మొత్తం మీద అప్పట్లో జరిగిన పేలుడులో స్కూలు కాంపౌండ్ వాల్ కొంత దెబ్బతింది. పేలుడు ధాటికి రాళ్లు ఎగిసి వచ్చి పడటంతో.. సమీపంలో నిలిపి ఉంచిన కొన్ని కార్ల అద్దాలు పగిలాయి. ఓ వైపు కాలుష్య భూతంతో పోరాడుతున్న ఢిల్లీకి.. మరోవైపు ఈ పేలుళ్లు కలవరాన్ని కలిగిస్తున్నాయి.