Site icon HashtagU Telugu

Arvind Kejriwal: ఇంటి మరమ్మత్తుల కోసం రూ.45 కోట్లు… కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు

Arvind Kejriwal

Arvind Kejriwal (2)

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షాలకు తానే అస్త్రాలను అందిస్తున్నారా…అంటే అవుననే అనాల్సి వస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తాను నిరాండబరంగా ఉంటానంటూ చెప్పిన కేజ్రీవాల్ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇంటి మరమ్మత్తుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

ఇల్లు మరమ్మత్తుల కోసం కేజ్రీవాల్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వస్తున్న వేళ ఆప్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నిజానికి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు తాను సింప్లిసిటీకే ప్రాధాన్యతనిస్తానని, విలాసవంతమైన అలవాట్లు లేవంటూ కేజ్రీవాల్ చెప్పారు. అయితే తాజాగా తన ఇల్లు బాగు చేసుకునేందుకు 45 కోట్లు వెచ్చిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీకి ఇదే అస్త్రంగా మారింది.

నిరాండబరంగా ఉంటానంటూ చెప్పిన కేజ్రీవాల్‌కి ఇన్ని విలాసాలెందుకు..? అని ప్రశ్నిస్తోంది. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఆ డబ్బుతోనే విలాసవంతమైన ఇళ్లు కట్టుకుంటున్నారని మండిపడుతోంది. ప్రజా ధనాన్ని కేజ్రీవాల్ తన లగ్జరీ లైఫ్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడింది. ఇదే విషయంపై ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది.

మరోవైపు బీజేపీ విమర్శలకు ఆప్ కూడా ధీటుగానే బదులిస్తోంది. ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ నివసిస్తున్న ఇల్లు 80 ఏళ్ల క్రితం కట్టారని, పైకప్పు పూర్తిగా పాడైపోయినందునే రెనోవేషన్ చేస్తున్నామంటూ ఆప్ నేత,ఎంపీ సంజయ్ సింగ్ చెబుతున్నారు. ఒక్కరోజులో ఎన్నో దుస్తులు మార్చే ప్రధాని మోదీలా మాత్రం ఖర్చు చేయడం లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సమయంలో రూ.8,400 కోట్లు పెట్టి ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆప్ గుర్తు చేసింది. ఆయన ఇంటి మరమ్మతుల కోసం రూ.500 కోట్లు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది.

లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి రిపేర్ల కోసం రూ.15కోట్లు వెచ్చించారని, గుజరాత్ సీఎం విమానం ఖరీదు రూ.191 కోట్లు అని ఎదురుదాడికి దిగింది. కాగా ఇంటీరియర్ డెకరేషన్ కోసం రూ. 11.30 కోట్లు , స్టోన్, మార్బుల్ ఫ్లోరింగ్ కోసం రూ.6 కోట్లు, ఇంటీరియర్ కన్సల్టెన్సీకి రూ.కోటి , ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌ల కోసం రూ.2.58కోట్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కోసం రూ.2.85 కోట్లు, వార్డ్‌రోబ్‌కి రూ.1.41 కోట్లు, కిచెన్ అప్లియనెస్స్ కి రూ.1.1కోట్లు ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు సీఎంవో అధికారులు. అయితే…బీజేపీ మాత్రం విమర్శలు ఆపడం లేదు. ఇంట్లో కర్టెన్ల కోసమే లక్షల రూపాయలు వెచ్చించారంటూ మండిపడుతూ నిరసనకు దిగింది. మొత్తం మీద కేజ్రీవాల్ హౌస్ రెనోవేషన్‌ ప్రతిపక్షాలకు ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మారింది