ఢిల్లీలోని ముస్లింలు (Muslims) ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత ఆప్(AAP) ఆధిక్యం కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయా స్థానాల్లో బీజేపీ (BJP) దూసుకొచ్చింది. మొత్తం 12 స్థానాల్లో ప్రస్తుతం 7 చోట్ల బీజేపీ లీడింగ్లో ఉంది. దీనికి కారణం బీజేపీ ముస్లిం మోర్చా చేపట్టిన ‘సైలెంట్ క్యాంపెయిన్’ అని అంటున్నారు.
ఈ సైలెంట్ క్యాంపెయిన్‌లో భాగంగా 4-7 మంది సభ్యుల బృందాలను ఏర్పాటుచేసి ప్రతి ఇంటికి వెళ్లి వోటర్లు వారి వివరాలు సేకరించి, ‘లాభార్థి యోజన’ పేరిట కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వారికీ సమాచారాన్ని అందించారు. ఈ పథకాలు ఎంతో మేలు చేస్తుండడం తో మోదీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న వారు సైతం బిజెపికి ఓటు వేయాలనే ఆలోచన చేసారు. ప్రతి నియోజకవర్గంలో 70-80 చిన్న మీటింగ్స్‌ను నిర్వహించి, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎవరూ గమనించని అవకాశాలను ఎంచుకుంటూ ఆప్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లను ఆకర్షించడంలో బీజేపీ విజయం సాధించింది.
ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అరగంట క్రితం 50 స్థానాల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ ప్రస్తుతం 41కి తగ్గిపోయింది. ఇక ఆప్ పార్టీ 18 నుంచి 28కి పుంజుకుంది. చాలాచోట్ల అభ్యర్థుల ఆధిక్యాలు 500 నుంచి 1000 మధ్యే ఉంటున్నాయి. దీంతో ప్రతి రౌండ్ ముగిసే సరికి నంబర్లు అటూ ఇటూ మారుతున్నాయి. మెజారిటీని నిర్ణయించడంలో ముస్లిం ఆధిపత్య నియోజకవర్గాలు కీలకం కాబోతున్నాయి.