BJP – Reservations : ‘‘దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేందుకు బీజేపీ వెనుకాడదు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. ‘‘భారత రాజ్యాంగాన్ని బీజేపీ కచ్చితంగా సవరిస్తుంది. అందుకోసం ఆ పార్టీ చాలా ప్రయత్నాలే చేస్తోంది’’ అని ఆయన హెచ్చరించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. రిజర్వేషన్లను తగ్గించే క్రమంలోనే ఆ నిర్ణయాన్ని బీజేపీ తీసుకుంది’’ అని పి.చిదంబరం తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి (BJP – Reservations) తగిన మెజారిటీ లేకున్నా.. రిజర్వేషన్ల వ్యవస్థను కూల్చేందుకు కుట్రలు చేసే అవకాశం లేకపోలేదన్నారు.
Also Read :KBC 16 Crorepati : ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-16’లో తొలి కోటీశ్వరుడు ఈ కుర్రాడే..
దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నందుకు కేంద్రంలోని మోడీ సర్కారును చిదంబరం ఈసందర్భంగా అభినందించారు. దేశంలో క్యాష్ లెస్ పేమెంట్స్ గణనీయంగా పెరగడం చాలా మంచి పరిణామమన్నారు. నేటికీ జర్మనీలాంటి ఐరోపా దేశాల్లోనూ పూర్తిగా క్యాష్ లెస్ పేమెంట్స్ వ్యవస్థ రాలేదని ఆయన గుర్తు చేశారు. డిజిటల్ పేమెంట్స్‌కు ఎంత డిమాండ్ పెరిగినా.. నగదును దగ్గర ఉంచుకోవాలనే ప్రజల ఆలోచనను మార్చలేమని చిదంబరం చెప్పారు. ‘‘పెద్దనోట్ల రద్దు ప్రకటన నాటికి మన దేశంలో రూ.16-17 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంది. ఇప్పుడు మన దేశంలో రూ. 34 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంది. అంటే చలామణిలో ఉన్న నగదు రెట్టింపు అయింది. డిజిటల్ క్యాష్ లెస్ పేమెంట్స్ వల్ల ఈ మార్పు వచ్చింది’’ అని ఆయన వివరించారు. ‘‘దేశంలో మౌలిక సదుపాయాల వికాసం జరుగుతుండటం మంచి పరిణామం. అయితే దీనివల్ల పేదలకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు. ధనిక వర్గాలు మాత్రమే వాటి వల్ల ప్రయోజనాలు పొందగలుగుతున్నారు’’ అని చిదంబరం విమర్శించారు.