Mumbai: ముంబై కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారా?

దేశ ఆర్థిక రాజధాని ముంబయి. అందుకే పాలకులతోపాటు ప్రజలందరి దృష్టీ దానిపైనే ఉంటుంది.

  • Written By:
  • Updated On - April 9, 2022 / 03:23 PM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయి. అందుకే పాలకులతోపాటు ప్రజలందరి దృష్టీ దానిపైనే ఉంటుంది. నిద్రలేచింది మొదలు.. నిద్రపోయే వరకు అంతా ఉరుకులు పరుగులు. ఎవరికీ క్షణం తీరికుండదు. అలాంటి ముంబయి దేశానికి గుండెకాయ లాంటిది. కానీ మహారాష్ట్ర రాజధానిగా ఉన్న అలాంటి ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది అని ఆరోపించారు శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్. అసలు ఆయన ఆరోపణల్లో నిజమెంత? ముంబయి ఆర్థికంగా బలంగా ఉన్న మహానగరం. అలాంటి నగరంలో రోజువారీగా ఎన్నో అంశాలపై లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సంస్కృతులు, మనస్తత్వాలు, మనుషులు ఇక్కడ కనిపిస్తారు. చెప్పాలంటే ఇదో మినీ ప్రపంచం. కానీ అలాంటి ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. కేంద్ర హోంశాఖకు ప్రజంటేషన్ కూడా ఆ పార్టీ నేతలు ఇచ్చారని.. దానికి తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. సంజయ్ రౌత్ ఆరోపించడం సంచలనం సృష్టించింది.

ఎంపీ కిరిట్ సోమయాతో కలిసి కొందరు పార్టీ నేతలు, ఇంకొందరు వ్యాపారస్తులు కలిసి చేస్తున్న కుట్ర ఇది అని రౌత్ ఆరోపించారు. వాళ్లంతా కలిసి ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి సంబంధించి రెండు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారన్నారు. సమావేశాలతోపాటు నిధులను కూడా సేకరిస్తున్నారని.. దీనిపై కేవలం ఆరోపణలు మాత్రమే చేయడం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. సీఎం ఉద్దవ్ ఠాక్రేకూ ఈ విషయం తెలుసన్నారు. ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం గా చేయడానికి సంబంధించి.. ఠాక్రేకు పూర్తి సమాచారముంటే ఎందుకు ఆయన బయటపెట్టలేదు? ఇప్పుడు బీజేపీతో శివసేనకు ఎలాంటి పొత్తూ లేదు. కాబట్టి ఠాక్రే ఎందుకు వెనకుడుగు వేస్తున్నారు? ఇక కేంద్రపాలిత ప్రాంతం విషయానికి సంబంధించి.. బీజేపీ టీమ్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు రౌత్. ముంబయిలో మరాఠీ మాట్లాడేవారు తగ్గిపోతున్నారు. అందుకే దానిని ఆధారంగా చేసుకుని .. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆ టీమ్ కోరే ఛాన్స్ ఉందంటున్నారు రౌత్.

ముంబయి స్కూళ్లలో మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని కిరీట్ కోర్టులో సవాల్ కూడా చేశారు. ఆ విషయాన్ని కూడా రౌత్ ప్రస్తావించారు. మరిప్పుడు శివసేన ముందున్న మార్గమేంటి? ఆ పార్టీ ఉనికే స్థానికత మీద ఆధారపడి ఉంది. మరాఠీలకు న్యాయం జరగాలన్నదే దాని పోరాటానికి ఊపిరి. అలాంటిది ఇప్పుడు ముంబయి లాంటి మహానగరం విషయంలో దాని పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందా అన్నదానిపై ఇతర పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి.