BJP suspends: ఏడుగురు ఎమ్మెల్యేలపై బీజేపీ వేటు.. కారణమిదే..?

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 27 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పనితీరుపైనే అందరి చూపు పడింది.

  • Written By:
  • Publish Date - November 20, 2022 / 03:19 PM IST

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 27 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పనితీరుపైనే అందరి చూపు పడింది. రాష్ట్రంలో కమలాన్ని గెలిపించేందుకు ఆ పార్టీ మరోసారి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై బీజేపీ ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంది. పార్టీపై తిరుగుబాటు చేసిన 7 మంది ఎమ్మెల్యేలపై గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ వేటు వేశారు.

గుజరాత్ లో ఏడుగురు ఎమ్మెల్యేలపై బీజేపీ వేటు వేసింది. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు పార్టీ తెలిపింది. కాగా.. ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకి పార్టీ టికెట్లు నిరాకరించడంతో వారు ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేశారు. ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తెలిపారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిలో మధు శ్రీవాస్తవ, అరవింద్ లడానీ, దిను పటేల్, హర్షద్ వాసవ, ధవల్ సింగ్ ఝాలా 7 మంది పేర్లు ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో పలువురు బీజేపీ నేతలు స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అరవింద్ లడానీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వాఘోడియా నుంచి బీజేపీ టికెట్‌పై 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవకు టికెట్ రాకపోవడంతో ఆయన కూడా స్వతంత్రంగా రంగంలోకి దిగారు. గుజరాత్‌లో మళ్లీ కమలం పార్టీ వికసించే బాధ్యతను ప్రధాని మోదీ తీసుకున్నారు. దీని కోసం ఆయన విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1న, రెండో దశ డిసెంబర్ 5న జరగనుంది. దీని తర్వాత డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అదే రోజు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఎన్నికల ప్రకటనతో గుజరాత్‌లో నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చింది. అభ్యర్థులు నవంబర్ 14 వరకు నామినేషన్లు దాఖలు చేశారు. నవంబర్ 17న కొందరు నామినేషన్ల ఉపసంహరించుకున్నారు.