BJP First List: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ సోమవారం ఉదయం విడుదల చేసింది. ఈమేరకు ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. జమ్మూకశ్మీర్‌లో 60-70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని భావిస్తున్నారు. సోమవారం పార్టీ 44 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది.
వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. రాజ్‌పోరా నుంచి బీజేపీ అభ్యర్థిగా అర్షిద్ భట్‌ను ఎంపిక చేసింది. కాగా షోపియాన్ నుంచి జావేద్ అహ్మద్ ఖాద్రీకి టికెట్ ఇచ్చారు. అనంత్‌నాగ్ వెస్ట్ స్థానం నుంచి బీజేపీ మొహమ్మద్‌ను నామినేట్ చేసింది. అనంత్‌నాగ్ స్థానం నుంచి సలాహ్ సయ్యద్ వజాహత్‌ను బరిలోకి దింపింది. కిష్త్వార్ నుంచి షగుణ్ పరిహార్, దోడా అసెంబ్లీ స్థానం నుంచి గజయ్ సింగ్ రాణాకు టికెట్ ఇచ్చారు. నిర్మల్ సింగ్‌కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. లోయలో ఇద్దరు కాశ్మీరీ పండిట్లకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. శ్రీనగర్‌లోని హబ్బాకదల్ నుంచి కాశ్మీరీ హిందువు అశోక్ భట్ బరిలోకి దిగారు. ఈ సీటులో అత్యధిక సంఖ్యలో కాశ్మీరీ హిందూ ఓటర్లు ఉన్నారు.
బీజేపీ ప్రకటనకు ముందు ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. గులాం నబీ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా 2014 తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 90 మంది సభ్యులున్న అసెంబ్లీకి మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న జరగనుంది. కాగా రెండో దశకు సెప్టెంబర్ 25న ఓట్లు వేయనున్నారు. మూడో, చివరి దశ ఓటింగ్ అక్టోబర్ 1న జరగనుంది. కాగా అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read: Gaddam Prasad : స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ !