UP Elections : ఆ ఒక్కటి గెలిస్తే అంతా విజ‌య‌మే.. యూపీలో బీజేపీ వేస్తున్న ఆ లెక్క ఫ‌లించేనా?

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. మూడో విడ‌త‌లో క‌ర్హల్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక ముగియ‌డంతో పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - February 21, 2022 / 12:09 PM IST

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. మూడో విడ‌త‌లో క‌ర్హల్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక ముగియ‌డంతో పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. కేడ‌ర్‌లో ధైర్యం నింప‌డానికి స‌మాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాద‌వ్ ఇక్కడ స్వయంగా పోటీ చేశారు. యూపీలో అఖిలేష్ ఒక్కరే త‌మ ప్రత్యర్థి అని, ఆయ‌న‌ను ఓడిస్తే, ఎస్పీని ఓడించిన‌ట్టేన‌ని భావించి బీజేపీ బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. ఆరెస్సెస్‌, బీజేపీ శ్రేణులు భారీగా త‌ర‌లి వ‌చ్చాయి.

ఓట‌రు లిస్టులోని ఒక పేజీలోని ఓట‌ర్లకు బాధ్యత వహించే ప‌న్నా ప్రముఖులు విస్తృతంగా ప‌ని చేశారు. ప్రతి ఓట‌రునూ క‌లిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్వయంగా ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి స‌త్యపాల్ సింగ్ బ‌ఘేల్‌ను అఖిలేష్ కు ప్రత్యర్థిగా నిలిపారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని విధాలుగా ప్రయ‌త్నాలు చేశారు. అఖిలేష్ ఓట‌మి ఖాయ‌మ‌న్న రీతిలో ప్రచారం చేశారు.

అటు అఖిలేష్ విజ‌యం సాధిస్తార‌ని, కాబోయే ముఖ్యమంత్రి ఆయ‌నేని ఎస్పీ వ‌ర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవ‌రో చెప్పడానికి మార్చి ప‌దో తేదీన వ‌చ్చే ఫ‌లితాల వ‌ర‌కు ఆగాల్సిన ప‌నిలేద‌ని కూడా అంటున్నాయి.
ఎస్పీ ప్రచారాన్ని చూసి బీజేపీ త‌న విధానాల‌కు ప‌దును పెట్టింది. హిందూ రాష్ట్ర స్థాప‌న త‌మ‌తోనే సాధ్యమంటూ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అఖిలేష్ కుటుంబ స‌భ్యులు, ఇత‌ర ఎస్పీ నాయ‌కుల‌పై వ్యక్తిగ‌త విమ‌ర్శల‌ను ప్రారంభించింది.

ఎస్పీ మాత్రం ఎప్పటిలాగే ఆవారా ప‌శువులు, ఇత‌ర స‌మ‌స్యల‌ను ప్రస్తావిస్తోంది. ఒక‌ప్పడు కంచుకోట‌లాంటి క‌ర్హల్ శివ‌పురి జ‌ల్లాలో ఉంది. అక్కడ ఎస్పీని సంపూర్ణంగా ఓడించ‌డం ద్వారానే ఘ‌న విజ‌యం సాధించిన‌ట్టు బీజేపీ భావిస్తోంది. దాంతో క‌ర్హల్ ఫ‌లితం లెక్కలు వేసుకుంటూ ప్రచార వ్యూహాల‌ను రూపొందించుకుంటోంది.