Maharashtra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 20న జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ఇవాళ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేరు కూడా ఉంది. ఆయనకు నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ టికెట్‌ను కేటాయించారు. బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు భోకర్ స్థానాన్ని కేటాయించారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే, రాష్ట్ర మంత్రులు గిరీష్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, అతుల్ సేవ్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి.
Also Read :KTR Vs CMO : కేటీఆర్ వర్సెస్ సీఎంఓ.. సియోల్ పర్యటనపై ట్వీట్ల యుద్ధం
గత శుక్రవారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనే మహాయుతి కూటమిలోని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. మహాయుతి కూటమిలో సీఎం ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ భాగస్వామ్య పక్షాలుగా(Maharashtra Elections) ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లకుగానూ 240 సీట్ల విషయంలో ఈ మూడు పార్టీల మధ్య ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. మిగతా 48 అసెంబ్లీ సీట్ల కేటాయింపు విషయంలో ఈ పార్టీల అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇక విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ)లో ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్‌సీపీ, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా మహారాష్ట్రలో జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఎంవీఏ కూటమి ఉంది. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ కూటమి మంచి ఫలితాలను సాధించింది. అదే తరహా రిజల్ట్‌ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సాధించాలని విపక్ష కూటమి ఉవ్విళ్లూరుతోంది.