Controversial Comments : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బీ.పి. హరీష్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి హాట్‌టాపిక్ అయ్యారు. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రసాంత్‌ను కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ ఉమా ప్రసాంత్ స్వయంగా ఫిర్యాదు చేయడంతో, బుధవారం కేటీజే నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బీజేపీ ఎమ్మెల్యేపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 132, 351(2), 79 కింద కేసు నమోదైంది.
దావణగెరె నగరంలో రిపోర్టర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన హరీష్, “నేను ఎమ్మెల్యే. కానీ ఎస్పీ నన్ను ఫంక్షన్లలో చూసినప్పుడు మొహం బిగుసుకుంటుంది. అదే సమయంలో షామనూర్ కుటుంబ సభ్యుల కోసం గేట్ల వద్ద ఎదురు చూస్తుంది. వాళ్ల ఇంటి పోమెరేనియన్ కుక్కలా ప్రవర్తిస్తుంది” అని అన్నారు. షామనూర్ శివశంకరప్ప కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కాగా, ఆయన కుమారుడు మల్లికార్జున మైన్స్, జియాలజీ, హార్టికల్చర్ మంత్రిగా ఉన్నారు. మల్లికార్జున భార్య ప్రభా మల్లికార్జున దావణగెరె లోక్‌సభ సభ్యురాలు.
CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇదే!
హరీష్ మాట్లాడుతూ, “హరిహర పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో నేను వేదికపైకి వెళ్లినా ఎస్పీ నన్ను పట్టించుకోలేదు. కానీ గాంధీభవన్ మైదానంలో మండుటెండలో ప్రభా మల్లికార్జున రాక కోసం మాత్రం గంటల తరబడి వేచి ఉంది. ఒక కాన్వెంట్‌లో పిల్లలను గంటన్నర పాటు కూర్చోబెట్టి ఎంపీ రాక కోసం వేచిచూడమని చెప్పారు. నేను ఆ కార్యక్రమం వదిలి వెళ్లిపోయాను. ఇది వివక్ష కాదా?” అని ప్రశ్నించారు. మరింతగా, “ఎస్పీ ధనవంతుల, అధికారవర్గాల రక్షణలో ఉంటే బాగుంటుందని అనుకుంటే అది తాత్కాలికమే. ఇది ఎక్కువ కాలం నిలవదు” అంటూ వ్యాఖ్యానించారు.
ఇక ఇదే సమయంలో మరో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఆర్.వి. దేశ్‌పాండే కూడా ఒక మహిళా జర్నలిస్ట్‌తో అనుచితంగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. జోయిడా తాలూకాలో ప్రసూతి ఆస్పత్రి లేమిపై ఆమె అడిగిన ప్రశ్నకు, “మీ డెలివరీ సమయానికి ఆస్పత్రి ఏర్పడుతుంది” అని సమాధానమిచ్చారు. జర్నలిస్ట్ తనకు అలాంటి వయసు దాటి పోయిందని చెప్పినా, దేశ్‌పాండే నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
ఎస్పీ ఉమాపై ఎమ్మెల్యే హరీష్ చేసిన వ్యాఖ్యలు, అలాగే మహిళా జర్నలిస్ట్‌పై దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం రేపాయి. ప్రజా ప్రతినిధులు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంలో తప్పు సందేశం ఇస్తుందని పౌర సమాజం మండిపడుతోంది.
GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు