BJP New States: 2024 తర్వాత రాష్ట్రాలు 50కి.. యూపీలో 4, మహారాష్ట్రలో 3, కర్ణాటక లో 2 స్టేట్స్ : కర్ణాటక మంత్రి

దేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచాక .. రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని అంటున్నారు కర్ణాటక క్యాబినెట్ మంత్రి, బీజేపీ నేత ఉమేష్ కత్తి.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 11:06 AM IST

దేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచాక .. రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని అంటున్నారు కర్ణాటక క్యాబినెట్ మంత్రి, బీజేపీ నేత ఉమేష్ కత్తి. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టగానే.. జనాభా రీత్యా పెద్ద రాష్ట్రాలను విభజించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

ఈక్రమంలో కర్ణాటక రాష్ట్రాన్ని కూడా రెండు ముక్కలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్ తో ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపు నిచ్చారు. కర్ణాటక రాష్ట్రం ముక్కలైనా తాము కన్నడిగులు గానే ఉంటామన్నారు.
ఉత్తరప్రదేశ్ ను 4 రాష్ట్రాలుగా, మహారాష్ట్ర ను 3 రాష్ట్రాలుగా విభజించాలని యోచించే అవకాశం ఉందని ఉమేష్ కత్తి పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్రాల విభజన తప్పదని ఆయన చెప్పారు. అయితే ఉమేష్ కత్తి వ్యాఖ్యలపై పలువురు కర్ణాటక మంత్రులు కూడా పెదవి విరిచారు. సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కూడా విభేదించారు. “ఉమేష్ కత్తి ఇలాంటి మాటలు మాట్లాడటం కొత్తేమీ కాదు.

గతంలోనూ చాలా సార్లు ఈవిధమైన కామెంట్స్ చేశారు. దేశంలో రాష్ట్రాలు 50కి పెరుగుతాయని ఆయన చెప్పడం ఇది తొలిసారి మాత్రం కాదు” అని సీఎం బొమ్మై వ్యాఖ్యానించారు. ఉమేష్ కత్తి వ్యాఖ్యలపై కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ కూడా స్పందించారు.”ఉమేష్ ఈవిధమైన కామెంట్స్ ఇప్పటికి 100 సార్లు చేసి ఉంటాడు. ఆయన మాటలను పెద్దగా పట్టించు కోవాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. మొత్తం మీద ఉమేష్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రాచేశాయని చెప్పడంలో సందేహం లేదు.