Site icon HashtagU Telugu

Wrestlers Protest: మ‌హిళా రెజ్ల‌ర్లు సాక్షిమాలిక్‌, బ‌బితా ఫోగ‌ట్ మ‌ధ్య మాట‌ల యుద్ధం.. అస‌లేం జ‌రిగిందంటే?

Sakshi Malik Vs Babita Phogat

Sakshi Malik Vs Babita Phogat

భార‌త్ రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ (Brij Bhushan Saran Singh) పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేస్తూ రెజ్ల‌ర్లు సాక్షిమాలిక్‌ (Sakshi Malik) , వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) తోపాటు ప‌లువురు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసింది. సుదీర్ఘ ఆందోళ‌న అనంత‌రం లైంగిక వేధిపుల కేసులో బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు న‌మోదు చేశారు. ఆ త‌రువాత రెజ్ల‌ర్లు సాక్షి మాలిక్‌, కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత, బీజేపీ నాయకురాలు బ‌బితా ఫోగ‌ట్ (Babita Phogat) మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. ట్విట‌ర్ వేదిక‌గా ఇరువురు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. సాక్షి మాలిక్‌ ఆమె భ‌ర్త స‌త్య‌వ‌ర్త్ క‌డియాన్ తో క‌లిసి ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

రెజ‌ల్లింగ్ స‌మాఖ్య‌లో 90శాతం మందికి లైంగిక వేధింపులు జ‌రుగుతున్నాయ‌ని తెలుసు. అయితే, మా రెజ్ల‌ర్ల‌లో ఐక్య‌త లేక‌పోవ‌టం వ‌ల్ల కొంత మంది మాత్ర‌మే నిర‌స‌న తెల‌ప‌డానికి ముందుకు వ‌చ్చార‌ని అన్నారు. మా ఆందోళ‌న వెనుక ఎలాంటి రాజ‌కీయ ఒత్తిడి లేద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కురాలు, కామ‌న్‌వెల్త్ బంగారు ప‌త‌క విజేత బ‌బితా ఫోగ‌ట్ గురించి ప్ర‌స్తావించారు. మేము దీక్ష చేయ‌డానికి జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద అనుమ‌తి తీసుకుంది కూడా బీజేపీ నాయ‌కులైన బ‌బితా ఫోగ‌ట్‌, తీర‌థ్ రాణాలేన‌ని తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖ‌నుసైతం ఆ వీడియోలో చూపించారు.

సాక్షి మాలిక్, ఆమె భ‌ర్త స‌త్య‌వ‌ర్త్ క‌డియాన్ వ్యాఖ్య‌ల‌ప‌ట్ల బ‌బితా ఫోగ‌ట్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ట్విట‌ర్ వేదిక‌గా రిప్లై ఇస్తూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మిమ్మ‌ల్ని చూసి నాకు బాధ‌గా అనిపించింది. కానీ మ‌ళ్లీ న‌వ్వుకూడా వ‌చ్చింది. మిత్ర‌మా మీరు కావాల‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల్ల నాకు వ‌చ్చే ఇబ్బందేమీలేదు. మీరు వీడియోలో చూపించిన లేఖ‌లో నాపేరు, నా సంత‌కం గానీ లేదు. ప‌రోక్షంగా కూడా నా ప్ర‌స్తావ‌న ఉంద‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. నాకు ప్ర‌ధానిపైనా, మ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌పైనా న‌మ్మ‌కం ఉంది. నేను ఈ విష‌యాన్ని మొద‌టి రోజునుంచి చెబుతున్నాను అని పేర్కొంది.

మీరు ఆందోళ‌న‌కు ముందు ప్ర‌ధాని మోదీ, హోమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాల‌ని సూచించాను. కానీ, మీరు కాంగ్రెస్ లీడ‌ర్లు ప్రియాంకా గాంధీ, రేప్ కేసుల్లో నిందితులైన దీపేంద‌ర్ హుడాల‌ను మీరు ఆశ్ర‌యించారు. ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌లు మీ అస‌లు రూపాన్ని చూస్తున్నారు. మీ నిర‌స‌న తీరుచూస్తే ఇదంతా కాంగ్రెస్ నాయ‌కులు ఆడిస్తున్న ఆట అని అంద‌రికీ అర్థ‌మ‌వుతుంద‌ని బ‌బితా ఫోగ‌ట్‌ అన్నారు. అయితే, బ‌బితా ఫోగ‌ట్ ట్వీట్‌కు సాక్షి మాలిక్ స్పందించారు. మీ స‌హ‌చ‌రులంతా ఇబ్బంది ప‌డుతుంటే మీరు మాత్రం ప్ర‌భుత్వం ఒడిలో చ‌ల్ల‌గా సేద‌దీరుతున్నారంటూ విమ‌ర్శించారు. మీ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం మీ స‌హ‌చ‌రుల ఆందోళ‌నను హేళ‌న చేయ‌డం స‌రికాద‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు.