40 MLAs @Rs 800cr: మా ఎమ్మెల్యేల కోసం రూ.800 కోట్లు… బీజేపీపై ఆప్ ఆరోపణలు

బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 07:34 PM IST

బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు కమలం పార్టీ 800 కోట్లు సిద్ధం చేసుకుందని ఆరోపించింది. తమ పార్టీకి చెందిన 40 మందిని బీజేపీ కొనేందుకు చూస్తోందని విమర్శించింది.

ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 25 కోట్లు ఆఫర్ చేసారని ఆరోపణలు గుప్పించింది. ఇవాళ ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ ఆరంభమయ్యే సమయానికి ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఆప్ లో కలవరం మొదలైంది. అయితే కాసేపటికి 53 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ మీటింగ్ కు హాజరయ్యారు. స‌మావేశం అనంత‌రం ఎమ్మెల్యేల‌తో క‌లిసి కేజ్రీవాల్ మ‌హాత్మాగాంధీ స‌మాధి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్క‌డ ఆప్ ప్ర‌భుత్వాన్ని కూల్చే బీజేపీ కుట్ర‌ను విఫ‌లం చేయాల‌ని మ‌హాత్ముడిని వేడుకున్నారు. కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారంటూ నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు సంచలన ఆరోపణలు చేశారు. త‌మ‌తో దాదాపు పాతిక మంది ఆప్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని బీజేపీ నేత‌లు చెప్పార‌ని ఆప్ ఎమ్మెల్యేలు వివ‌రించారు.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం స‌భ్యుల సంఖ్య 70 కాగా, ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ఆప్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ ఖండించింది. ఆ ఆఫ‌ర్ ఇచ్చిన బీజేపీ నేత‌లెవ‌రో చెప్పాల‌ని నిల‌దీసింది.
లిక్క‌ర్ స్కామ్ నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికే ఆప్ ఈ డ్రామా ప్రారంభించింద‌ని బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ ఆరోపించారు. ఇదిలా ఉంటే శుక్ర‌వారం ఢిల్లీ అసెంబ్లీ రెండు రోజుల పాటు ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది.