Ghulam Nabi Comments: బీజేపీ హీరో, కాంగ్రెస్ జీరో!

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఒక హీరో అంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ ప్ర‌శంసిస్తూ ప‌రోక్షంగా మోడీ స‌ర్కార్ ను ఎత్తిపొడిచారు.

  • Written By:
  • Updated On - May 5, 2022 / 01:06 PM IST

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఒక హీరో అంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ ప్ర‌శంసిస్తూ ప‌రోక్షంగా మోడీ స‌ర్కార్ ను ఎత్తిపొడిచారు . గోరంత చేసి కొండంత ప్ర‌చారం చేసుకోవ‌డంలో ఆ పార్టీ తిరుగులేని హీరోగా చెలామ‌ణి అవుతుంద‌ని ప‌రోక్షంగా వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. మ‌హా రాష్ట్ర మాజీ సీఎం ఫ‌డ్న‌విస్ వేదిక‌పై ఉండ‌గానే అలాంటి అస్త్రాన్ని బీజేపీపై ఆజాద్ చాక‌చక్యంగా వ్యంగ్యాన్ని పండించారు. దేశానికి ఎంతో చేసిన‌ప్ప‌టికీ ప్ర‌చారం చేసుకోవ‌డంలో కాంగ్రెస్ పార్టీ జీరో గా మారింద‌ని అన్నారు. ప‌బ్లిసిటీ చేసుకోవ‌డంలో బీజేపీ హీరోకాగా, కాంగ్రెస్ జీరో అంటూ త‌న‌దైన శైలిలో ఆజాద్ ప్ర‌స్తుత ఎన్టీయే ప్ర‌భుత్వానికి చుర‌క‌లు వేశారు. లోక్‌మత్ టైమ్స్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డ్స్ – 2021లో కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఆరోగ్య‌శాఖ మంత్రిగా ఎంతో చేయాల‌ని అనుకున్నార‌ని అన్నారు.

ఆనాడు మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో కావాల‌ని ఆరోగ్య‌శాఖ మంత్రిత్వ‌శాఖ‌ను తీసుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర ఆరోగ్య మంత్రిగా అనేక ఆవిష్కరణలు , కొత్త ఆలోచనలను అమలు చేసిన విష‌యాన్ని అవ‌లోకించారు. దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రాథమిక నమూనా మార్పును తీసుకువచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. వైద్య కళాశాలల నిర్మాణానికి, వైద్య బోధనా అధ్యాపకుల వయస్సును పెంచడంలో పెద్ద మార్పుల‌ను చేప‌ట్టామ‌ని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్యం, విద్యను మెరుగుపరచడం అవ‌స‌ర‌మ‌ని ఆజాద్ అన్నారు. భారతీయ వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు ల‌భిస్తోన్న విష‌యాన్ని ఆజాద్ వెల్ల‌డించారు. ఆజాద్ చేతుల మీదుగా ‘కోవిడ్ మహమ్మారి సమయంలో సమాజానికి అత్యుత్తమ సేవ’ విభాగంలో ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డ్ 2021స‌ని ఫడ్నవీస్ మరియు మహారాష్ట్ర ఇంధన మంత్రి నితిన్ రౌత్ అందుకున్నారు.