Site icon HashtagU Telugu

TRIPURA ELECTION: మోత మోగేనా.? రసవత్తరంగా త్రిపుర ఎన్నికలు..!

bjp

Resizeimagesize (1280 X 720) 11zon

ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తిప్రాల్యాండ్‌ నినాదంతో బీజేపికి వణుకుపుట్టిస్తోంది ఓ పార్టీ. సామాన్యులు, సామాజిక సేవ కోసం ఏర్పాటైన సంస్థ.. ఈ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా మారే అవకాశం ఉందంటున్నారు. దీంతో మిగతా పార్టీలకు ఎన్నికల వేళ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తిప్రా మోతా ఎన్నికల బరిలో నిలవడంతో అన్ని పార్టీల లెక్కలు మారాయి. త్రిపుర (Tripura) ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు అమ్ముల పొదుల్లోంచి అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నాయి. ఈ నెల 16న పోలింగ్ జరగనుంది.

ఐతే ఈసారి గెలుపు అన్ని పార్టీలకు కీలకంగా మారింది. 2018 ఎన్నికల్లో బీజేపీ గెలిచి పాతికేళ్ల లెఫ్ట్‌ పాలనకు తెర దించింది. గిరిజనుల్లో బాగా పట్టున్న IPFT పార్టీతో జట్టుకట్టి ఘనవిజయం సాధించింది. సీపీఎం 16 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్‌ సోదిలోకూడా లేకుండా పోయింది. ఈసారి మాత్రం తిప్రా మోతా రూపంలో కొత్త పార్టీ తెరపైకి రావడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. కొంతకాలంగా ప్రత్యేక గిరిజన రాష్ట్రం కోసం పోరాడుతున్న తిప్రా మోతా.. పార్టీగా రూపాంతరం చెందింది. బీజేపీతో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగానే రంగంలోకి దిగి పోటీని ముక్కోణంగా మార్చేసింది. అధికార బీజేపీ కూటమికి గట్టి సవాలు విసురుతోంది. మూలవాసులైన గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్‌ తిప్రాలాండ్‌ను సాధిస్తామన్న మోతా హామీ ఎస్టీలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Also Read: CM KCR: నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో రాజకీయం చేస్తున్నారు: సీఎం కేసీఆర్

గిరిజనుల్లోని లెఫ్ట్‌ ఓటు బ్యాంకుకూ మోతా గండి కొట్టేలా ఉంది. త్రిపురలో గిరిజన ప్రాబల్యం ఎక్కువ. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 20 వారికి రిజర్వయ్యాయి. 2018లో బీజేపీ కూటమి 20 ఎస్టీ సీట్లలో ఏకంగా 17 స్థానాలను దక్కించుకుంది!. ఈసారి తిప్రా మోతాకే ఓటేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు అక్కడి జనం. ఈ సీట్లలో 12 చోట్ల మోతాకు విజయావకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. 50 నుంచి 60 శాతం మధ్య ఉన్న 5 స్థానాల్లో మోతా గట్టి పోటీ ఇవ్వనుండగా 50 శాతం కంటే తక్కువగా ఉన్న మిగతా మూడు చోట్ల ముక్కోణ పోరు జరిగేలా కన్పిస్తోంది. ఎలా చూసినా బీజేపీ కూటమికి ఈ 20 సీట్లలో ఈసారి రెండు మూడు సీట్లకు మించి దక్కకపోవచ్చని అంచనా.

గిరిజనేతర అసెంబ్లీ స్థానాల్లో కూడా మోతా ఏకంగా 22 చోట్ల పోటీకి దిగడం బీజేపీకి నిద్ర లేకుండా చేస్తోంది. బీజేపీ కూటమి 12 నుంచి 15 సీట్లు కోల్పోయి హంగ్‌ అసెంబ్లీ ఏర్పడవచ్చని భావిస్తున్నారు. 10 నుంచి 15 సీట్లు గెలిచేలా కన్పిస్తున్న మోతా కింగ్‌మేకర్‌ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు.ఇక 2018లో అధికారానికి దూరమైన లెఫ్ట్‌ పార్టీ.. ఈసారి ఓట్ల చీలికపై బాగా ఆశలు పెట్టుకుంది. బీజేపీ కూటమిని ఓడించేందుకు శత్రుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. బీజేపీ ఓటు బ్యాంకుకు మోతా గండికొట్టనుండటం సీపీఎం-కాంగ్రెస్‌ కూటమికి కలిసొచ్చేలా కన్పిస్తోంది. దీనికి తోడు 2.5 లక్షల ఉద్యోగాలు తదితర హామీలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా త్రిపుర ఎన్నికల్లో మోతా ఈసారి కింగ్‌ మేకర్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు .