Site icon HashtagU Telugu

BJP Trouble: బీజేపీని కలవరపెడుతున్న ఆ 140 నియోజకవర్గాలు.. అమిత్ షా మాస్టర్ ప్లాన్

amit shah

amit shah

బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. దానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది కమలం అధిష్టానం. అందుకే 2019లో తమను తిరస్కరించిన 140 నియోజకవర్గాలపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఆ స్థానాల్లో కేంద్ర మంత్రులు పర్యటించాలని చెప్పింది. ఇప్పటికే ఈ విషయంపై ఏం చేయాలో పార్టీ క్యాడర్ కు అమిత్ షా దిశానిర్దేశం చేశారు.

ఆ 140 నియోజకవర్గాల్లో ప్రజలు ఎందుకు బీజేపీకి ఓటు వేయలేదో తెలుసుకోవడమే కేంద్రమంత్రుల పర్యటన ఉద్దేశం. అందుకే అక్కడ బీజేపీ విజయానికి ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా వారు పరిశీలిస్తారు. పైగా కేంద్రంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో ప్రజలకు వివరించాలన్నారు అమిత్ షా. దీనివల్ల వచ్చే ఎన్నికల నాటికి ఆయా ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకును పెంచుకోవడమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది.

నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి 8 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారు. ఇది ఈనెల 25నే ప్రారంభమైంది. వచ్చే నెల 30 వరకు కొనసాగనుంది. ఇక కేంద్రమంత్రులు ఆ 140లో.. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 30 మంది బూత్ స్థాయి కార్యకర్తల్ని కలుసుకోవాల్సి ఉంటుంది. పార్టీ బాగా బలహీనంగా ఉన్న సుమారు 100 పోలింగ్ బూత్ ల రిపోర్టులు కూడా తెమ్మని అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు కనీసం 10 మంది బూత్ స్థాయి కార్యకర్తలను కలిసి మాట్లాడాలి. అలా ఒక్కొక్కరు 25 బూత్ ల రిపోర్టులను అధిష్టానానికి అందించాల్సి ఉంటుంది.

బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కమలవికాసం దిశగా అమిత్ షా వేగంగా చర్యలు తీసుకుంటున్నారని అర్థమవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది.