Haryana Assembly Elections : ఎనిమిది మంది తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ఆదివారంనాడు ప్రకటించింది. వీరిలో ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అక్టోబర్ 5న జరుగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో పార్టీ ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆరేళ్ల పాటు వీరిని పార్టీ నుంచి బరిష్కరిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మోహన్ లాల్ బదోలి ప్రకటించారు. తక్షణం ఆ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపారు.
Read Also: Raja Singh : ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరి అరెస్ట్..!
పార్టీ బహిష్కరణ వేటుపడిన మాజీ మంత్రుల్లో రంజిత్ చౌతాలా, సందీప్ గార్గ్ ఉన్నారు. తనకు టిక్కెట్ నిరాకరించడంతో రంజిత్ చౌతాలా పార్టీని విడిచిపెట్టగా, ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనిపై సందీప్ గార్గే పోటీకి దిగడంతో ఆయనపై వేటుపడింది. తక్కిన వారిలో అస్సాంథ్ సీటులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్ శర్మ, గనౌర్ నుంచి పోటీలో ఉన్న దేవేందర్ కడ్యాన్, సఫిడో నుంచి బరిలో ఉన్న మాజీ మంత్రి బచన్ సింగ్ ఆర్య, మెహం నుంచి పోటీ చేస్తున్న రాధా అహ్లావత్, గురుగావ్ నుంచి పోటీ పడుతున్న నవీన్ గోయెల్, హథిన్ నుంచి పోటీలో ఉన్న కెహర్ సింగ్ రావత్ ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 5వ తేదీకి ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. హర్యానాతో పాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటిస్తారు.