BJP Ex.MP: కర్ణాటకకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే తాజా వివాదంలో చిక్కుకున్నారు. రోడ్డుపై జరిగిన ఘర్షణలో ముస్లిం కుటుంబాన్ని దాడిచేసి, కులపరమైన దూషణలు చేస్తూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.
హలేనహళ్లికి చెందిన సైఫ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి తుమకూరులో వివాహ వేడుక ముగించుకొని ఇన్నోవా కారులో తిరిగి వస్తుండగా, నిజగల్ సమీపంలో తెలుపు రంగు ఎక్స్‌యూవీ 700 కారు వారి వాహనాన్ని అడ్డగట్టిందని ఆరోపించారు. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, ఒకరు తమను ‘డిపార్ట్‌మెంట్’ నుంచి వచ్చానంటూ బెదిరించాడని సైఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాదం తీవ్రతకు దారి తీసి, సైఫ్ సోదరుడు సల్మాన్ ఖాన్‌పై దాడి చేసి మూడు పళ్లు విరిగేలా కొట్టారని, తమపై దాడికి మార్గదర్శకత్వం అందించినవారిలో మాజీ ఎంపీ హెగ్డే ఉన్నారని ఆరోపించారు. దాడి సమయంలో “సాబ్రు గ్రూప్ వాళ్లు” అని అన్నారని, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ‘తక్కువ కులం’ అంటూ కుల దూషణలు చేసినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
సైఫ్ తల్లి గుల్ ఉన్నీసాపైనూ దాడి జరిగిందని, ఆమె మెడ పట్టుకొని కింద పడేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో గన్‌మ్యాన్ తుపాకీతో బెదిరించి, కుటుంబాన్ని కాల్చి చంపుతామని హెచ్చరించారని సైఫ్ తెలిపాడు. గాయపడ్డ వారిని దాబస్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసహాయం అందించారు.
పోలీసులు సైఫ్ వాంగ్మూలం ఆధారంగా అనంతకుమార్ హెగ్డేను ప్రధాన నిందితుడిగా, ఆయన గన్‌మ్యాన్, డ్రైవర్‌లను సహనిందితులుగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా అందిందని పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ, ఇది రెండు వాహనాల మధ్య ఓవర్‌టేకింగ్ ఘర్షణ నుంచి మొదలైందన్నారు. “హెగ్డే స్వయంగా దాడిలో పాల్గొనలేదని సమాచారం ఉంది. విచారణ కొనసాగుతోంది, దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయి,” అని పేర్కొన్నారు.
AP Cabinet : ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. పెట్టుబడులు, రాజధాని అభివృద్ధిపై దృష్టి