Elections 2024 : జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇంకొన్ని గంటల్లో పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి తాజా సమాచారం ప్రకారం జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 25 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక బీజేపీ 19 స్థానాల్లో, పీడీపీ 5 స్థానాల్లో లీడ్‌లో ముందుకు సాగుతున్నాయి. గండేర్ బల్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధిక్యంలో ఉన్నారు. బుడ్గాం అసెంబ్లీ స్థానంలోనూ ఈ సారి ఆయన పోటీ చేశారు. ప్రస్తుత ట్రెండ్‌నుబట్టి జమ్మూకశ్మీర్ (Elections 2024) టఫ్ ఫైట్ కనిపిస్తోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. పీడీపీ కీలకంగా మారే అవకాశం ఉంది. పీడీపీ మద్దతును పొందే కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి.
హర్యానాలో అధికార బీజేపీ తడబడుతోంది. అక్కడ కాంగ్రెస్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలు మనోహర్ లాల్ ఖట్టర్ (కర్నాల్), అనిల్ విజ్ (అంబాలా కంటోన్మెంట్) వెనుకంజలో ఉన్నారు. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకుగానూ కాంగ్రెస్ దాదాపు 50కిపైగా చోట్ల లీడ్‌లో దూసుకుపోతోంది బీజేపీ 14 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ 2 చోట్ల లీడ్‌లో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు ఏడుచోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ నేత, ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ లీడ్‌లో ఉన్నారు. జేజేపీ పార్టీకి చెందిన దుష్యంత్ చౌతాలా ఉచానా కలన్ స్థానంలో వెనుకంజలో ఉన్నారు. మొత్తం మీద హర్యానాలో కమల దళానికి ఈసారి మొండిచెయ్యే మిగిలేలా ఉంది. ప్రత్యేకించి గత రెండేళ్లలో హర్యానాలో శాంతిభద్రతలు బాగా దెబ్బతిన్నాయి. నూహ్ లాంటి ఏరియాల్లో మత ఘర్షణలు జరిగాయి. దీంతో ప్రజల్లో బీజేపీపై ఆగ్రహం పెరిగింది. దాని ఫలితం ఇప్పుడు ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిబింబించింది.