Site icon HashtagU Telugu

BJP Target 300: యూపీ ఎన్నిక‌లపై జేపీ న‌డ్డా జోస్యం… 300 సీట్లు గెలుస్తామ‌ని ధీమా…?

Nadda 1579520164 Imresizer

BJP chief JP Nadda

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ 300 సీట్లు గెలుస్తుంద‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తెలిపారు. ఉత్త‌ర ప్ర‌దేవ్ ఎన్నిక‌ల‌కు బీజేపీ పార్టీ పూర్తిగా స‌న్న‌ద్ధ‌మైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం, కార్య‌క‌ర్త‌ల కోసం 365 రోజులు అధినాయ‌క‌త్వం ప‌ని చేస్తుంద‌ని…దేశంలో మార్పును ప్ర‌భావితం చేసే భావాజాలం క‌లిగిని పార్టీగా బీజేపీని ఆయ‌న వ‌ర్ణించారు. కోవిడ్ సమయంలో అన్ని పార్టీలు కనుమరుగయ్యాయని…బీజేపీ మాత్రమే ప్ర‌జ‌ల్లో ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటి రోజు నుండి ప్రజా సమస్యలను లేవనెత్తామ‌ని ..తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొదటి రోజు నుండి త‌మ వాగ్దానాలను అమలు చేయడం ప్రారంభించామ‌న్నారు. పార్టీ, ప్రభుత్వం రెండూ మ్యానిఫెస్టో అమలును పర్యవేక్షిస్తాయని జేపీ న‌డ్డా తెలిపారు.

యూపీ విషయానికొస్తే యోగి సీఎం అయిన రోజు నుంచే త‌మ ప‌నిని ప్రాంర‌భించామ‌ని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు వ‌చ్చే స‌రికి ఇతర పార్టీలు మేల్కొన్నాయ‌ని ఎద్దేవా చేశారు. ఒక్కో బూత్‌కు 10 మంది యువకులు ఉంటారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పార‌ని…. ఇదొక కొత్త ప్రక్రియ‌న‌ని న‌డ్డా తెలిపారు. నితిన్ గడ్కరీ దీనిని ముందుకు తీసుకెళ్లార‌ని… ఒక్కొక్కరు 20 మంది దళితులు, 20 మంది మహిళలు, 20 మంది ఓబీసీలు, 20 మంది యువకులు, 20 మంది ఆర్థికంగా వెనుకబడిన వారుగా ఉంటార‌ని తెలిపారు.

యోగి జీ ప్రభుత్వం “గన్న” రైతులకు రూ.1.40 లక్షల కోట్లు ఇచ్చిందని… అఖిలేష్ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లు కూడా చెల్లించామ‌ని న‌డ్డా తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ రెండు ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తం కంటే యోగి ప్ర‌భుత్వం ఇచ్చినది ఎక్కువని ఆయ‌న తెలిపారు. బీఎస్పీ హయాంలో 21 చక్కెర మిల్లులు మూతపడ్డాయని… అఖిలేష్ హయాంలో 11 మూతపడ్డాయని న‌డ్డా పేర్కొన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక వాటిని పునరుద్ధరించామ‌న్నారు. జిన్నా సమస్యల విషయానికొస్తే, అఖిలేష్ యాద‌వ్‌ దీనిని ప్రస్తావనకు తెచ్చారన్నారు.ఇది ఆయ‌న మనస్తత్వాన్ని ఎత్తి చూపుతుందని.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశవ్యతిరేక శక్తులను ఆయన ఏవిధంగా పొగిడగలరో దీన్నిబట్టి తెలుస్తుందని న‌డ్డా అన్నారు. భారతదేశ విభజనలో జిన్నా పాత్రను ప్రజలు చూశారని… వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామ‌ని న‌డ్డా వెల్ల‌డించారు.

రైతుల ఉద్య‌మంపై కూడా న‌డ్డా స్పందించారు.ఇది అఖిల భారత రైతుల ఆందోళన కాదని… కొన్ని ప్రాంతాల్లో కొంత మంది వ్యక్తులు ఈ ఆందోళ‌న చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి మూడు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లాయని… ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఓట్ల శాతం 3% నుంచి 38%కి పెరిగిందని… తమిళనాడు, కేరళలో ఓడిపోయామ‌న్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడూ అధికారంలో లేద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 100 ఉప ఎన్నికలు జరిగితే..అందులో బీజేపీ 60 గెలుచుకుందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింద‌ని… యుపి, రాజ‌స్థాన్‌ జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింద‌ని స్ప‌ష్టం చేశారు.

రైతులు త‌మ మాట వినడానికి ఇష్టపడకపోతే చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ తెలిపార‌ని… ఇది తాము భయపడి చేసింది కాద‌న్నారు. బీజేపీ18 కోట్ల మంది ప్రజల పార్టీ అని…భయపడాల్సిన పనిలేదని తెలిపారు. ప్ర‌ధాని మోదీ రైతులకు కిసాన్‌ నిధి, హెల్త్‌కార్డులు, స్వామిత్య జోజన, పింఛన్‌ ఇచ్చారని…ఎంఎస్‌పీపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారని న‌డ్డా తెలిపారు. రైతులను ఒప్పించడంలో మేము విఫలమయ్యామని కాద‌ని…వారు చ‌ట్టాల‌ను అర్థం చేసుకోవడానికి ఇష్టపడలేదన్నారు.

లీడర్‌కి, రీడర్‌కి తేడా ఉంటుందని… లీడర్ అనే వారు వ్రాసిన స్క్రిప్ట్ ని చ‌ద‌వ‌ర‌ని..న‌డ్డా ఎద్దేవా చేశారు. ఎప్పుడూ గుడికి వెళ్లని ఈ నాయకులు నుదుటిపై చందనం పెట్టుకుని ప్రసంగాలు చేయడం విడ్డూరంగా ఉంద‌ని నడ్డా తెలిపారు.ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ 300 సీట్లకు పైగా గెలుస్తుందని ఆయ‌న జోస్యం చెప్పారు.