Arrest Warrants On Adani : భారత బిలియనీర్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి సంబంధించి అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురిపై అక్కడ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఈ వివరాలను వెల్లడించారు. రాబోయే 20 ఏళ్లలో రూ.16వేల కోట్ల లాభాన్ని ఆర్జించి పెట్టగల సోలార్ పవర్ సప్లై ఒప్పందాలను అదానీ గ్రీన్ ఎనర్జీకి పొందేందుకు.. కొందరు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులకు దాదాపు రూ.2,200 కోట్ల లంచాలను అదానీ గ్రూప్ ముట్టజెప్పిందని వారు ఆరోపించారు. అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా నిధులను సమీకరించాయన్నారు.
Also Read :High Court Bench : రాయలసీమకు గుడ్ న్యూస్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ !
అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అక్రమ మార్గాల ద్వారా రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి రూ.25వేల కోట్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించిందని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఇక అదానీ గ్రూపుపై అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మరో సివిల్ కేసును నమోదు చేసింది. అమెరికా సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి రూ.1,400 కోట్లకుపైగా సమీకరించిందని ఆ కేసుకు సంబంధించిన అభియోగాల్లో ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. అమెరికా కోర్టు రికార్డుల ప్రకారం.. ఒక జడ్జి గౌతం అదానీ, సాగర్ అదానీలపై అరెస్టు వారెంటును జారీ చేసినట్లు తెలిసింది. ఈ వారెంట్లను త్వరలోనే అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి(Arrest Warrants On Adani) పంపుతారని సమాచారం. ఈ వార్తలపై అదానీ గ్రూప్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అమెరికా సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తుల జాబితాలో రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్, సిరిల్ కెబానెస్, కెనడాకు చెందిన సంస్థాగత ఇన్వెస్టర్ ‘సెయిస్ డిపో ఎట్ ప్లేస్‌మెంట్ డ్యూ క్యూబెక్’ ఉన్నారు. సిరిల్ కెబానెస్ .. ఫ్రెంచ్- ఆస్ట్రేలియన్ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. అతడు సింగపూర్‌లో జీవించేవాడు.