Convicts Surrendered : 11 మంది సరెండర్.. లొంగిపోయిన బిల్కిస్ బానో కేసు దోషులు

Convicts Surrendered : బిల్కిస్ బానో‌ గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.

  • Written By:
  • Publish Date - January 22, 2024 / 07:48 AM IST

Convicts Surrendered : బిల్కిస్ బానో‌ గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. తాము లొంగిపోవడానికి కొన్ని నెలల టైం కావాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆదివారంలోగా జైలులో లొంగిపోవాలని జనవరి 8న దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు, కుటుంబంలో వివాహం, వ్యవసాయ పనులు వంటి కారణాలతో జైలు బయట ఉండేందుకు అనుమతులు  ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర కోర్టు తీర్పుతో జీవిత ఖైదు శిక్ష పడిన  11 మంది దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే హక్కు, అధికారం గుజరాత్  ప్రభుత్వానికి లేవని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో దోషులంతా వెళ్లి గోద్రా సబ్ జైలు అధికారుల ఎదుట ఇప్పుడు సరెండర్(Convicts Surrendered) అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

2002 సంవత్సరంలో గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానో‌పై  11 మంది దోషులు గ్యాంగ్‌రేప్ చేశారు. అంతేకాదు బిల్కిస్ బానో ఫ్యామిలీలోని దాదాపు ఏడుగురిని దారుణంగా హత్య చేశారు.  వీరంతా 2008 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు జైలులోనే ఉన్నారు. అయితే 2022 ఆగస్టు 15న గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి, వారందరికీ క్షమాభిక్షను ప్రసాదించి జైలు నుంచి విడుదల చేసింది. 11 మంది దోషుల పేర్లు.. బకాభాయ్ వోహానియా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, గోవింద్ నాయ్, జస్వంత్ నాయ్, మితేష్ భట్, ప్రదీప్ మోర్ధియా, రాధేశ్యామ్ షా, రాజుభాయ్ సోనీ, రమేష్ చందనా, శైలేష్ భట్. 

నరోడా పటియా కేసు

బజరంగ్ దళ్‌కు చెందిన కొందరు వ్యక్తుల నాయకత్వంలో ఒక అల్లరి మూక 2002 ఫిబ్రవరి 28వ తేదీన గుజరాత్‌లోని నరోదా పటియా పట్టణాన్ని దిగ్బంధించి 97 మందిని చంపేసింది. సిట్ ఏర్పాటు కావడానికి ముందు స్థానిక పోలీసులు 46 మందిని అరెస్ట్ చేసి, నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. ఆ తర్వాత సిట్ మరో 24 మందిని అరెస్ట్ చేసి, ఇంకో నాలుగు చార్జ్‌షీట్లు వేసింది. ఈ కేసులోని మొత్తం 70 మంది నిందితుల్లో ఏడుగురు విచారణ సమయంలో చనిపోయారు. ఇద్దరు ఇంకా పరారీలోనే ఉన్నారు. మొత్తం నిందితుల్లో 32 మందిని విచారణ కోర్టు దోషులుగా ప్రకటించింది. 29 మందిని విడిచిపెట్టింది. దోషులుగా ప్రకటించిన వారిలో ఇద్దరు చనిపోయారు. దోషులుగా ప్రకటితులైన వారు గుజరాత్ హైకోర్టులో 12 అప్పీళ్లు వేశారు. కోర్టు 2018 ఏప్రిల్ 25 నాటికి ఈ అప్పీళ్లన్నిటినీ పరిష్కరించింది. ప్రధాన నిందితురాలైన మాయా కొద్నాని సహా 18 మందిని హైకోర్టు విడుదల చేసింది. మిగతా 13 మందిని కింది కోర్టు దోషులుగా ప్రకటించటాన్ని బలపరిచింది. అలాగే విచారణ కోర్టు విడుదల చేసిన మరో ముగ్గురిని కూడా అప్పీళ్లు విచారించిన హైకోర్టు దోషులుగా ప్రకటించింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో 10 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.