Bihar Election: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Election) తొలి దశ పోలింగ్ గురువారం (నవంబర్ 06) ముగిసింది. తొలి దశలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జన సూరాజ్ నేత ప్రశాంత్ కిషోర్ ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో కంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ జరగడం అనేది, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కొత్త వ్యవస్థ రాబోతోందని స్పష్టం చేస్తోంది అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
గత ఎన్నికల్లో ఈ 121 స్థానాల్లో 55.81 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే ఈసారి సాయంత్రం 5 గంటలకే ఆ సంఖ్య 60.13 శాతానికి చేరింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈసారి ఎన్నికల్లో పూర్తి ఉత్సాహంతో బరిలోకి దిగింది. ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read: 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!
మహాఘట్‌బంధన్ నాయకుల వాదనలు
మరోవైపు మహాఘట్‌బంధన్ నాయకులు తమ వాదనలను వినిపిస్తున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గురువారం మాట్లాడుతూ.. మహాఘట్‌బంధన్ ప్రచారానికి బీహార్ ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించిందని అన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత, విద్వేష రాజకీయాలను తిరస్కరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విపక్ష కూటమి ప్రజల సంక్షేమం, జీవనోపాధి సమస్యలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందని బేబీ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
ముఖేష్ సహాని (వీఐపీ సుప్రీమో) మాట్లాడుతూ.. బీహార్‌లో మార్పు గాలి వీస్తోందని, బంపర్ ఓటింగ్ నమోదైనట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈసారి మొత్తం బీహార్‌లో మార్పు వచ్చి మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
100కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమా
బీజేపీ నేత సమ్రాట్ చౌదరి మొదటి దశలో పెరిగిన ఓటింగ్ శాతంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమకు అందిన నివేదికల ప్రకారం.. 121 సీట్లలో దాదాపు 100 సీట్లలో ఎన్‌డీఏ (NDA) విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “2010లో లాలూ కుటుంబం నుండి ఎవరూ గెలవలేకపోయినట్లే, ఈసారి కూడా లాలూ కుటుంబం నుండి ఎవరూ గెలవలేరు” అని ఆయన జోస్యం చెప్పారు.
