Site icon HashtagU Telugu

Bihar : ఆర్జేడీ అధినేత లాలూతో బీహార్ సీఎం నితీష్ భేటీ.. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌లపై చ‌ర్చ‌..?

Bihar

Bihar

బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలుప్ర‌సాద్ యాద‌వ్‌ని క‌లిశారు.ఈ సందర్భంగా 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసే ప్రయత్నాల మధ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన లాలు ప్ర‌సాద్ యాద‌వ్ త‌న కుమార్తె మిసా భారతి ఇంటికి వెళ్లారు. బీహార్ సీఎం నితీష్‌ కుమార్ లాలూ ప్రసాద్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్న లాలూ ప్రసాద్‌తో తన ఆరోగ్యం గురించి ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నానని, ఆయనను భౌతికంగా కలవడం త‌న‌కు సంతోషంగా ఉంద‌ని నితీష్‌ కుమార్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

నితీష్ కుమార్ త‌న ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సహా ప్రతిపక్ష నాయకులను కలవాలని భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలపాలని నితీష్‌ కుమార్ గతంలో పలు సందర్భాల్లో సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడితే బీజేపీ 100 సీట్లలోపు పరిమితమవుతుందని ఫిబ్రవరిలో నితీష్ కుమార్ వెల్ల‌డించారు. పూర్నియాలో జరిగిన మహాఘటబంధన్ (మహాకూటమి) ర్యాలీని ఉద్దేశించి జెడి (యు) అధినేత మాట్లాడుతూ, ఈ విషయంలో కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. నితీష్ కుమార్ గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీకి వెళ్లి శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, డి రాజా, సీతారాం ఏచూరి, అఖిలేష్ యాదవ్ వంటి నేతలను కలిశారు.