Site icon HashtagU Telugu

Bihar : బీహార్ ఎన్నికల వేడి.. అభివృద్ధి ప్రాజెక్టులతో ఎన్డీఏ ముందంజ

Bihar Elections 2025

Bihar Elections 2025

Bihar : బీహార్ రాజకీయాల్లో వేడి ఎప్పుడో మొదలైంది. శరవేగంగా ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తుది షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అధికార బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మరోసారి గద్దె అధిరోహించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమి కూడా బలంగా పోటీకి సిద్ధమవుతోంది.

ఇప్పటికే బీహార్ పర్యటనలు పెంచిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ, ప్రత్యక్షంగా ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నారు. తాజగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ బీహార్‌కు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రానికి నాలుగు కొత్త అమృత్ భారత్ రైళ్లు మంజూరు చేయగా, రూ.2000 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బక్తియార్పూర్ – రాజ్‌గిర్ – తిలైయా రైలు మార్గాన్ని 104 కిలోమీటర్ల మేర డబులింగ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులతో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. అదేవిధంగా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఇక ప్రజాభిప్రాయ సేకరణల దశలో బీహార్ జనం మళ్లీ ఎన్డీఏకు మద్దతు ప్రకటించినట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. “ఇంక్ ఇన్‌సైట్” నిర్వహించిన ఓపీనియన్ పోల్స్ ప్రకారం.. ఎన్డీఏకు దాదాపు 48.9 శాతం మంది మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్-డిసెంబర్ మధ్యలో ఎన్నికలు జరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ పరిణామాలన్నీ చూస్తే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారనున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్రం నుంచి వరాల జల్లు, ప్రధాని పర్యటనలు, అభివృద్ధి పనులు అన్నీ ఎన్నికల గేమ్‌ను ప్రభావితం చేయనున్నాయన్నది స్పష్టమవుతోంది.

Accident: తమిళనాడులో స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారుల దుర్మరణం

Exit mobile version