Bihar Elections: బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22, 2025తో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రెండు లేదా మూడు విడతల్లో జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఛఠ్ పూజ వంటి ప్రాంతీయ పండుగలు పూర్తయ్యాక, నవంబర్ 5 నుండి 15 మధ్య ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి.
గతంలో కూడా 2020లో బిహార్‌లో ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించారు. అప్పట్లో మొదటి దశలో 71 నియోజకవర్గాలకు, రెండవ దశలో 94 స్థానాలకు, మూడవ దశలో 78 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటికీ అలాంటి మాదిరిగా దశల వారీగా ఓటింగ్ నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇతర నిబంధనల మేరకు, ఇప్పటికే ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. ఓటరు జాబితాల సవరణ, ఎన్నికల సన్నాహాల్లో భాగంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తదుపరి దశలో అధికారిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముండగా, అన్ని పార్టీలూ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి.
