LS Polls: పార్లమెంట్ ఎన్నికల ముగింట కాంగ్రెస్ కు భారీ షాకులు.. చేజారుతున్న కీలక నేతలు

  • Written By:
  • Updated On - February 19, 2024 / 10:56 PM IST

LS Polls: బీజేపీలో చేరేందుకు మాజీ సీఎం కమల్‌నాథ్‌ తన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో కలిసి ఢిల్లీ చేరుకొన్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. ఇందుకు బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటుచేసుకొన్నది. కమల్‌నాథ్‌కు విధేయులుగా భావించే మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం ఢిల్లీ చేరుకొన్నారు. చింధ్వారా రీజియన్‌కు చెందిన వీరంతా కమల్‌నాథ్‌తో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యాంపులో మాజీ మంత్రి లఖన్‌ గంగోరియా కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. వీరంతా కాంగ్రెస్‌ అగ్రనేతల ఫోన్లకు స్పందించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతంలో సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన సీనియర్‌ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌, మాజీ ఎంపీ మిలింద్‌ దేవ్‌రా వంటి నేతలు కాంగ్రెస్‌ను వీడగా.. తాజాగా ఆ జంపింగ్‌ లిస్టులో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌తోపాటు పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న ఎంపీ మనీశ్‌ తివారీ పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌తో సహా గత పదేండ్లలో ఏకంగా తొమ్మిది మంది మాజీ ముఖ్యమంత్రులు హస్తానికి రాంరాం చెప్పారు. ఈ జాబితాలో అమరిందర్‌ సింగ్‌(పంజాబ్‌), గులాం నబీ ఆజాద్‌(జమ్ముకశ్మీర్‌), విజయ్‌ బహుగుణ(ఉత్తరాఖండ్‌), అజిత్‌ జోగి(చత్తీస్‌గఢ్‌), ఎస్‌ఎం కృష్ణ(కర్ణాటక), నారాయణ్‌ రాణే(మహారాష్ట్ర), గిరిధర్‌ గమాంగ్‌(ఒడిశా) ఉన్నారు.అశోక్‌ చవాన్‌ గత వారం కాంగ్రెస్‌ను వీడగా.. గత నెల జనవరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌కు సన్నిహితుడు, మాజీ ఎంపీ మిలింద్‌ దేవ్‌రా కూడా బయటకు వెళ్లిపోయారు.