Indian Railways భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది.
ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే తిరిగి వస్తుంది. అదేవిధంగా, 24 గంటల నుంచి 72 గంటల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం కోత విధించి, 75 శాతం మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఒకవేళ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్‌ను రద్దు చేస్తే కేవలం సాధారణ రద్దు ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి.
టికెట్ ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసి, చివరి నిమిషంలో రద్దు చేయడాన్ని అరికట్టేందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు చివరి నిమిషంలో కూడా బెర్తులు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు కానున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
