Site icon HashtagU Telugu

Bhopal Gas Tragedy : భోపాల్ గ్యాస్ దుర్ఘటన వ్యర్థాలు.. 40 ఏళ్ల తర్వాత ఏం చేశారంటే.. ?

Bhopal Gas Tragedy Toxic Waste Shifted Union Carbide Factory

Bhopal Gas Tragedy : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 సంవత్సరం డిసెంబరు 2, 3 తేదీల్లో జరిగింది.  ఆనాడు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకర  మిథైల్ ఐసోసైనేట్  గ్యాస్ లీకైంది. దాన్ని పీల్చుకొని దాదాపు 5,479 మంది చనిపోయారు. వేలాది మంది రోగాల పాలయ్యారు. ఈ ఉదంతం జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 377 టన్నుల విష వ్యర్థాలను తరలించారు. బుధవారం రాత్రి వాటిని 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో లోడ్ చేసి భోపాల్‌కు 250 కి.మీ దూరంలోని ధార్ జిల్లాలో ఉన్న పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి(Bhopal Gas Tragedy) పంపారు. ప్రమాదకర వ్యర్థాలతో నిండి ఉన్నందున మధ్యలో జనావాసాల వద్ద ఎక్కడా ఈ ట్రక్కులు ఆగకుండా.. ట్రాఫిక్ క్లియరెన్సులతో గ్రీన్ కారిడార్‌ను  ఏర్పాటు చేశారు.

Also Read :Ajmer Dargah : అజ్మీర్ దర్గాకు 11వసారి చాదర్ పంపుతున్న ప్రధాని మోడీ

యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను తరలించే పనుల్లో దాదాపు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్మికులు ఒక్కొక్కరు కేవలం 30 నిమిషాల షిఫ్టుల్లో  పనిచేసి వ్యర్థాలను ప్యాక్ చేశారు. వాటిని ట్రక్కుల్లోకి లోడ్ చేశారు. ఈ క్రమంలో ప్రతి వర్క్ షిఫ్టు ముగిసిన తర్వాత ఈ కార్మికులు వైద్య పరీక్షలు చేశారు. ఇక పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరిన ఈ వ్యర్థాలను మూడు నెలల్లోగా కాల్చేయనున్నారు. ఒకవేళ ఏదైనా అవాంతరం కలిగితే.. వాటిని కాల్చేయడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుంది.

Also Read :Fact Check : పాకిస్తాన్‌లో తల్లిని పెళ్లాడిన యువకుడు ? నిజమేనా ?

ఈ వ్యర్థాలను కాల్చిన తర్వాత.. బూడిదలో ఏదైనా హానికరమైన మూలకం మిగిలి ఉందా లేదా అనేది తెలుసుకోనున్నారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించిన తర్వాత.. బూడిదను మట్టి, నీటితో సంబంధంలోకి రాకుండా జాగ్రత్తగా పాతిపెడతారు.యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోని వ్యర్థాలను ఇంకా తరలించకపోవడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఉదాసీనత కొత్త విషాదానికి దారి తీస్తుందని హెచ్చరించింది. అందుకే ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను తరలించారు.