Site icon HashtagU Telugu

Bhole Baba : భోలే బాబా వీడియో సందేశం.. 121 మంది మృతిపై ఏమన్నాడంటే..

Bhole Baba Hathras Stampede

Bhole Baba : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో భోలేబాబా ప్రవచన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.  జులై 2న ఈ విషాద ఘటన చోటుచేసుకున్నప్పటి నుంచి పరారీలో ఉన్న భోలేబాబా తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  హత్రాస్ తొక్కిసలాట ఘటనపై బోలే బాబా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన దుర్మార్గులు ఎవరూ తప్పించుకోలేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని హత్రాస్‌లోని ఫుల్రాయ్ గ్రామంలో ప్రవచన కార్యక్రమం (సత్సంగ్) నిర్వహించిన కమిటీ సభ్యులకు భోలే బాబా(Bhole Baba) పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘జులై 2 విషాద ఘటన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఈ బాధను భరించే శక్తిని దేవుడు నాకు ప్రసాదిస్తాడు. దయచేసి అందరూ ప్రభుత్వం, పరిపాలనపై నమ్మకం ఉంచండి. ఈ ఘటనకు కారకులైన వారెవరైనా దొరకక తప్పదు. దీనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా ఉండి.. వారికి జీవితాంతం సహాయం చేయాలని నేను కమిటీ సభ్యులను అభ్యర్థించాను’’ అని బోలేబాబా తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో భోలే బాబా పేరు లేదు. అయితే ఫుల్రాయ్ గ్రామంలో భోలే బాబా ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు  దేవ్ ప్రకాష్ మధుకర్‌ను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది.  దర్యాప్తులో గుర్తించే సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఈ ఘటనపై జ్యుడీషియల్ కమిటీతో విచారణకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. భోలే బాబా ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా భోలే బాబా వీడియో సందేశాన్ని విడుదల చేయడం  గమనార్హం.

Also Read :Puri Jagannath Rath Yatra : రేపే పూరీ జగన్నాథుడి రథయాత్ర.. ఈసారి ప్రత్యేకత ఇదీ

భోలే బాబా హాజరైన ప్రవచన కార్యక్రమానికి దాదాపు 2.50 లక్షల మంది హాజరయ్యారు. అయితే ఇంతమంది కోసం కేవలం 70 మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు. 2.50 లక్షల మంది కోసం ఒకే ఎంట్రీ పాయింట్, ఒకే ఎగ్జిట్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. జులై 2న భోలే బాబా ప్రసంగించాక.. వెళ్లిపోతుండగా ఆయన పాద ధూళి కోసం జనం ఎగబడిన క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు.